వ్యాక్సిన్ రాకపోతే భారత్‌లో రోజుకి 2.87 లక్షలమందికి కరోనా!

July 09, 2020


img

గత ఆరు నెలలుగా కరోనా వార్తలను చూస్తున్నవారికి ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితుల గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కొత్త విషయం ఏమిటంటే కరోనా వ్యాక్సిన్ మాత్రమే. ప్రస్తుతం భారత్‌తో సహా ప్రపంచంలో ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. 

భారత్‌లో రెండు కంపెనీలు తయారుచేసిన వ్యాక్సిన్లను ఈ నెలలోనే దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులలో మనుషులపై ప్రయోగించి చూడనున్నారు. ఒకవేళ అవి ఆశించినట్లు సత్ఫలితాలు ఇస్తే ఇక భారత్‌కు త్వరలోనే కరోనా నుంచి విముక్తి లభిస్తుందని ఆశించవచ్చు. కానీ ఒకవేళ సకాలంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోతే పరిస్థితి ఏమిటనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

అమెరికాలోని మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో పరిశోధకులు ఈ సమస్యపై నిర్ధిష్ట ప్రమాణాల ప్రకారం లోతుగా అధ్యయనం చేసి ఓ అంచనా రూపొందించారు. దాని ప్రకారం… ఒకవేళ సకాలంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోతే భారత్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరినాటికి భారత్‌లో రోజుకి 2.87 లక్షల మందికి, అమెరికాలో రోజుకి 95, 000, దక్షిణాఫ్రికాలో రోజుకి 21,000, ఇరాన్‌లో రోజుకి 17,000 కరోనా సోకే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. 

కరోనా వ్యాక్సిన్ తయారుచేసిన భారత్‌ బయోటెక్ సంస్థ అధినేత ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ తప్పకుండా ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలు ఇస్తుందని నమ్మకంగా చెప్పారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రూపొందించిన ‘కొవాక్సిన్’ ప్రపంచంలో మరే దేశంలోనైనా తయారుకాబోతున్న వ్యాక్సిన్ల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. 

ఆగస్ట్ 15నాటికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఐసీఎంఆర్‌ ప్రకటించినప్పటికీ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యి వాటికి డిసిజిఐ, ఐసీఎంఆర్‌ ఆమోదం లభించి భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు కనీసం మూడు, నాలుగు నెలలు పట్టవచ్చు. అంటే ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్ నాటికి భారత్‌లో తప్పకుండా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. 

అయితే ప్రస్తుతం భారత్‌లో రోజుకి 25,000 చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయి కనుక వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేసరికి భారత్‌లో సుమారు 50 నుంచి 75 లక్షల మంది కరోనా బారినపడే అవకాశం ఉంటుంది. కానీ దేశంలో కరోనా నుంచి కొలుకొంటున్నవారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది కనుక ఒకవేళ డిసెంబరులో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, అప్పటికి సుమారు 25-35 లక్షల యాక్టివ్ కేసులు ఉండవచ్చు. 

కనుక కరోనా వ్యాక్సిన్ త్వరగా రావాలని...అంతవరకు కరోనా బారిన పడకుండా కాపాడాలని ఆ భగవంతుడిని ప్రార్ధిద్దాం. మానవ ప్రయత్నంగా కరోనా సోకకుండా అంతవరకు అన్ని జాగ్రత్తలు పాటిద్దాం.


Related Post