పొరపాట్లు జరుగుతుంటాయి...విమర్శలెందుకు? కేటీఆర్‌

July 09, 2020


img

తెలంగాణలో కరోనా మహమ్మారిని అద్భుతంగా కట్టడి చేస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకొంటుంటే, కరోనా విషయంలో మొదటి నుంచి అన్నీ దాపరికమే...అరకొర ఏర్పాట్లు చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప మరేమీలేదంటూ కేంద్రప్రభుత్వం హైకోర్టు, ప్రతిపక్షాలు, మీడియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.

బుదవారం కరీంనగర్‌ జిల్లా నాగునూరులో ప్రతిమా సంచార వైద్యశాల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ ఈ విమర్శలపై స్పందిస్తూ, “అమెరికా వంటి అగ్రరాజ్యమే కరోనాను ఎదుర్కోవడంలో అనేక తప్పటడుగులు వేసింది. ప్రపంచదేశాలన్నీ కరోనాను ఎదుర్కోవడంలో నేటికీ తడబడుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడానికి చాలా గట్టిగా కృషి చేస్తోంది. చాలా ఏర్పాట్లు చేసింది. కానీ అక్కడక్కడ పొరపాట్లు జరుగుతుంటాయి. లోపాలు బయటపడుతుంటాయి. ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తోందో పట్టించుకోకుండా ప్రతిపక్షాలు ఆ తప్పులు, లోపాలను మాత్రమే భూతద్దంలో చూపిస్తూ విమర్శలు చేయడం సరికాదు. వీలైతే నిర్మాణాతకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ కరోనా పేరుతో రాజకీయాలు చేయడం సరికాదు. రాజకీయాలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. వ్యాక్సిన్‌తో కరోనా పూర్తిగా తగ్గిపోయిన తరువాత ఎవరు ఎన్ని రాజకీయాలైనా చేసుకోవచ్చు. కానీ కరోనా పేరుతో ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

కరోనా గురించి మొదట్లో ఎవరికీ అవగాహన లేకపోవడం వలన చాలా దేశాలు దానిని తేలికగా తీసుకొని అందుకు భారీ మూల్యం చెల్లిస్తున్నాయి. అమెరికాలో జరుగుతున్న కరోనా విధ్వంసం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే, “అటువంటి పరిస్థితి మనకి రాకూడదు...” అంటూనే కరోనాను ఎదుర్కోవడంలో అలసత్వం ప్రదర్శించడం ఏమనుకోవాలి?తెలియక చేసిన, జరిగిన పొరపాట్లను ఎవరూ తప్పుపట్టలేరు కానీ తెలిసిన తరువాత పొరపాట్లు చేస్తుంటే ఎవరూ క్షమించరు. 

తెలంగాణ ప్రభుత్వం మొదట్లో కరోనాను కట్టడి చేయడానికి చాలా గట్టిగా కృషి చేసిన మాట వాస్తవం. అందుకే మొదట్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కానీ ఆ తరువాత మళ్ళీ శరవేగంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ సడలించడమే అందుకు కారణమని ప్రభుత్వం అంటుంటే, తగినన్ని కరోనా టెస్టులు చేయకుండా దాచిపెట్టుకోవడమే కారణమని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని పరీక్షలు చేయడం లేదని, హెల్త్ బులెటిన్‌లో గణాంకాలలో పూర్తి వివరాలు ఇవ్వకుండా దాచిపెడుతోందని, ఆసుపత్రులలో సౌకర్యాలు లేవని సాక్షాత్ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కరోనా కట్టడిలో ప్రభుత్వం ఆసక్తి కోల్పోయిందని, ఇక ఆ సమస్యను ప్రజలే పరిష్కరించుకోవాలన్నట్లు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని హైకోర్టు ఘాటుగా విమర్శలు చేసింది. అది ప్రతిపక్షాలన్న మాట కాదు కదా? 

ఇప్పుడు ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోనే రోజుకు సుమారు 2,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజుకు కనీసం 7-8 మంది కరోనాతో చనిపోతున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 30,000కి చేరుకొన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 324 మంది కరోనాతో మరణించారు. ఇవన్నీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్వయంగా ప్రకటించిన గణాంకాలే కదా?అంటే రాష్ట్రంలో కరోనా అదుపు తప్పిందని అర్ధమవుతోంది కదా? 

హైదరాబాద్‌లో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో నగరంలో పలు ప్రాంతాలలో మార్కెట్లు వారం రోజులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకొన్నాయి. ప్రభుత్వమే హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించాలని ఆలోచించిందంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

కరోనా మహమ్మారి రాష్ట్రంలో ఇంత విధ్వంసం సృష్టిస్తుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయస్థాయితో... అమెరికాతోనో  పోల్చుకొని గణాంకాలు వల్లెవేస్తూ ‘ఆల్ ఈజ్ వెల్..ఆల్ ఈజ్ వెల్’ అని సర్ధిచెపుతుండటం విస్మయం కలిగిస్తుంది. పైగా ఈ వాస్తవాలను చెపుతున్నందుకు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

మంత్రి కేటీఆర్‌ చెప్పినట్లు ఏ వ్యవస్థలోనైనా పొరపాట్లు... లోపాలు జరగడం సహజం. కానీ వాటిని సరిదిద్దుకోమని హైకోర్టు, ప్రతిపక్షాలు చెపుతున్నప్పుడు, దానిని ‘బురదజల్లుడు’ అని వాదిస్తూ ఎదురుదాడిచేయడం సరికాదు. కరోనా విషయంలో డోనాల్డ్ ట్రంప్‌ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. దాంతో అమెరికాలో ఇప్పుడు ఏమవుతోందో కళ్ళకు కనబడుతూనే ఉంది. కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా ‘ఇగో’తో ఆవిధంగా వ్యవహరించి అటువంటి దారుణమైన పరిస్థితులు తెచ్చుకోకుండా హైకోర్టు, ప్రతిపక్షాలు చెపుతున్న మాటలను సానుకూలంగా స్వీకరించి తదనుగుణంగా ముందుకుసాగితే మంచిది కదా?


Related Post