కొత్త సచివాలయం ప్రత్యేకతలు

July 08, 2020


img

తెలంగాణ పాత సచివాలయం స్థానంలో కొత్తగా నిర్మించబోతున్న సచివాలయంలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది వనపర్తిలోని శ్రీకృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని పోలి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్ లాగ చాలా వెడల్పుగా ఉంటుంది. మొత్తం ఆరు అంతస్తులతో నిర్మించబోయే ఈ భవనంపై మసీదులపై ఉండే గుమ్మటాల వంటివి 11 ఉంటాయి. సచివాలయం ముందు జాతీయజెండా కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తారు. 

ఫ్రాన్స్‌లోని వెసాయ్‌ల్స్‌ ప్యాలెస్‌ ముందున్న ఉద్యానవనాలు, మద్యలో ఫౌంటెయిన్ వంటివి కొత్త సచివాలయం ముందు ఏర్పాటు చేస్తారు. సచివాలయం ముందు నిర్మించబోయే ఫౌంటెయిన్‌ను తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పుష్పం ఆకారంలో తీర్చిదిద్దుతారు. 

సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే కొత్త సచివాలయంలో కేవలం 40 శాతం భవనాలకు, పార్కింగ్ కొరకు వినియోగించుకొని మిగిలిన 60 శాతం ప్రదేశమంతా రకరకాల చెట్లు, అందమైన పచ్చికబయళ్ళ కోసం కేటాయించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో అనేక పెద్ద పెద్ద చెట్లున్నాయి. వాటిని యధాతధంగా ఉంచుతూ, వాటిలో కొత్త భవనానికి, పార్కింగ్‌కు అడ్డుగా వచ్చే కొన్నిటిని మాత్రం వేరే ప్రదేశానికి తరలిస్తారు. కొత్త సచివాలయంలోకి సహజసిద్దమైన వెలుతురు, గాలి ప్రవేశించేవిధంగా గ్రీన్‌ బిల్డింగ్ కన్సెప్ట్ తో నిర్మిస్తారు. సచివాలయంలో వీలైనంతవరకు సోలార్ విద్యుత్ వినియోగించుకొనే విదంగా ఏర్పాట్లు చేస్తారు.       

సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రుల పేషీలు, కార్యదర్శుల ఛాంబర్లు, వివిద శాఖల కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉంటాయి. అలాగే ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు, అధికారుల సమావేశాలకు వేర్వేరుగా పెద్దపెద్ద సమావేశమందిరాలు ఉంటాయి. ముఖ్యమంత్రి, మంత్రులను కలవడానికి వచ్చే దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు వేరేగా సమావేశమందిరాలు ఉంటాయి.  

సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. సచివాలయం ఆవరణలో సుమారు 800 కార్లు పార్క్‌ చేసుకొనేవిధంగా రూపొందించబోతున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ నేరుగా లిఫ్ట్ వద్దకు వెళ్ళేలా నిర్మించబడుతుంది కనుక సచివాలయానికి వచ్చిపోయేవారితో సంబందం లేకుండా ముఖ్యమంత్రి లిఫ్ట్ ద్వారా నేరుగా తన ఛాంబర్‌లోకి వెళ్లిపోగలరు.  

కొత్త సచివాలయం ఆవరణలో మళ్ళీ ఓ గుడి, మసీదు నిర్మిస్తారు. అలాగే క్యాంటీన్, బ్యాంకులు, ఏటిఎంలు, పోస్టాఫీస్, కొరియర్ సర్వీస్, చిన్న పిల్లల కోసం క్రెచ్ వంటివి కూడా ఏర్పాటు చేస్తారు. చెన్నైకి చెందిన ప్రసిద్ద ఆర్కిటెక్ట్ ఆస్కార్ అండ్ పొన్ని అనే సంస్థ ఈ భవనానికి మొత్తం 15 డిజైన్లు అందించగా వాటిలో దీనిని సిఎం కేసీఆర్‌ ఎంచుకొన్నారు. 


Related Post