వాస్తు కోసమే సచివాలయం కూల్చివేత?

July 08, 2020


img

ప్రతిపక్షాలు ఎంతగా విమర్శిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా సచివాలయం కూల్చివేస్తోంది. అసలు సచివాలయం కూల్చివేయడానికి కారణం ఏమిటంటే వాస్తుదోషమే కానీ అదని చెపితే హైకోర్టు కూల్చివేతను అనుమతించదు కనుక హైకోర్టుకు ఆమోదయోగ్యమైన రీతిలో సాంకేతిక కారణాలు చూపుతూ ప్రభుత్వం నివేదిక రూపొందించి ఆమోదముద్ర వేయించుకొందనేది బహిరంగరహస్యమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సచివాలయానికి వచ్చే మార్గంలో సచివాలయానికి రోడ్డుశూల ఉండటం, సచివాలయం నిర్మించబడిన స్థలం చదరం, దీర్ఘచతురస్రాకారాలలో కాకుండా గజిబిజిగా ఉండటం వంటి వాస్తు సమస్యలున్నాయని వాస్తు నిపుణులు చెప్పారు.   

సిఎం కేసీఆర్‌కు వాస్తు, గ్రహబలాలు, జాతకాలపై నమ్మకం ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. సచివాలయానికి చాలా వాస్తుదోషాలు ఉన్నాయని వాస్తుపండితులు చెప్పారు కనుకనే సిఎం కేసీఆర్‌ ఈ ఆరేళ్ళలో ఒక్కసారి కూడా సచివాలయంలో అడుగుపెట్టలేదు. వాస్తు ప్రకారం ప్రగతి భవన్‌ నిర్మించుకొని అక్కడి నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

సచివాలయం వాస్తుదోషాలను సరిచేసేందుకు దాని పక్కనే ఉన్న ఇతర భవనాలను కూడా తీసుకొని  దీర్ఘచతురస్రాకారంలో భూమి ఉండేవిధంగా చేస్తున్నారు. సచివాలయ నిర్మాణంలో వాస్తు సలహాల కోసం సుద్దాల తేజను కన్సల్టెంట్‌గా నియమించుకొన్నారు. ప్రభుత్వం ఆయనకు ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ కార్యాలయంలో ఒక ఛాంబర్ కూడా కేటాయించింది. ఆయన సచివాలయం కూల్చివేత, శంఖుస్థాపన, కొత్త సచివాలయం డిజైన్లలో మార్పులు చేర్పులు, తదుపరి ముహూర్థాలు తదితర అంశాలపై సిఎం కేసీఆర్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.   

సచివాలయంలో చాలా వాస్తుదోషాలున్నాయని సిఎం కేసీఆర్‌ బలంగా నమ్ముతున్న కారణంగానే ఎంతో గొప్ప చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని అర్ధమవుతూనే ఉంది. సిఎం కేసీఆర్‌ నమ్మకాల కోసం అంత ప్రాముఖ్యత, వందల కోట్లు ఖరీదు చేసే సచివాలయాన్ని కూల్చివేస్తున్నందునే రాష్ట్రంలో ప్రతిపక్షాలు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలలో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నప్పుడు వందల కోట్లు విలువగల సచివాలయాన్ని కూల్చుకొని, మళ్ళీ వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం కట్టుకోవడంలో ఔచిత్యం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కానీ హైకోర్టు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం సచివాలయం కూల్చివేతపనులు మొదలుపెట్టేసింది.


Related Post