హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విదించకతప్పదా?

July 04, 2020


img

హైదరాబాద్‌ నగరం దాని చుట్టుపక్కల జిల్లాలలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో గ్రేటర్ పరిధిలో మళ్ళీ 15 రోజులు లాక్‌డౌన్‌ విధించాలని యోచిస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ వారం రోజుల క్రితం చెప్పారు. దాంతో నగరంలో ప్రజలు హడావుడిగా నిత్యావసరసర సరుకులు కొనుగోలుచేయడం మొదలుపెట్టారు. లాక్‌డౌన్‌ విధిస్తే చిక్కుకుపోతామనే భయంతో ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో పనిచేసుకొంటున్నవారు, విద్యార్దులు తదితరులు హడావిడిగా ఏపీకి బయలుదేరుతుండటంతో టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్‌ అవుతోంది. కానీ ఇంతవరకు లాక్‌డౌన్‌ విధింపుపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో లాక్‌డౌన్‌ విధించకపోవచ్చుననే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కొలుకొంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున, లాక్‌డౌన్‌ విధించి మళ్ళీ ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనేబదులు నగరంలో కరోనా తీవ్రత, ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజలను మాత్రం నియంత్రిస్తే సరిపోతుందని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. కానీ గత 24 గంటలలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొత్తగా 1,658 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఇప్పుడు రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచుతున్నందున హైదరాబాద్‌తో సహా దాని చుట్టుపక్కల జిల్లాలలో ఇంతవరకు దాచిపెట్టుకొన్న కేసులు కూడా బయటపడితే కరోనా కేసుల సంఖ్య చాలా బారీగా పెరిగే అవకాశం ఉంటుంది కలక్టర్ కార్యాలయాలు, జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ కార్యాలయాలలోకి చివరికి చాలా కట్టుదిట్టమైన జాగ్రత్తలన్నీ పాటించే ప్రగతి భవన్‌లోకే కరోనా ప్రవేశించి సాక్షాత్ ముఖ్యమంత్రినే బయటకు పంపించగలిగినప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలుగకమానదు. కనుక కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మళ్ళీ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించక తప్పకపోవచ్చు. అయితే అది ఎప్పుడు? అనేదే ప్రశ్న.


Related Post