కరోనా వ్యాక్సిన్ పరీక్షలకు భారత్‌లో మరో కంపెనీ సిద్దం

July 04, 2020


img

కరోనా సోకకుండా నివారించే వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17 ఫార్మా కంపెనీలు పోటీపడుతున్నాయి. వాటిలో భారత్‌కు చెందిన భారత్‌ బయోటెక్ (హైదరాబాద్‌), జైడస్ కాడిలా హెల్త్ కేర్ (అహ్మదాబాద్) కూడా ఉన్నాయి. ఈ రెంటిలో భారత్‌ బయోటెక్ కంపెనీలో ఇప్పటికే మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ (మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగం) మొదలవగా, తాజాగా జైడస్ కాడిలా హెల్త్ కేర్ కంపెనీకి కూడా మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అవసరమైన అనుమతులు మంజూరు చేసింది. 

కనుక ఈ రెండు కంపెనీల ప్రయోగాలు ఫలిస్తే భారత్‌లో ఇంచుమించు ఒకేసమయంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి. ఒకేసారి రెండు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ కనుగొనగలిగితే వాటిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయవచ్చు కనుక దేశంలో వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువమందికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ రెంటిలో ఒకటి విఫలమైనా రెండో కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్ ఉంటుంది కనుక ఈ ఏడాది చివరిలోగా కరోనా వ్యాక్సిన్ భారత్‌లో అందుబాటులోకి రావచ్చు. అయితే అది నిరుపేద, సామాన్య ప్రజలకు  అందుబాటులోకి వచ్చినప్పుడే దేశం పూర్తిగా కరోనా నుంచి విముక్తి పొందగలదు.


Related Post