భారత్‌లో గణనీయంగా పెరిగిన కరోనా రికవరీ రేట్

July 03, 2020


img

కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ ఈరోజు ఒక మంచివార్త తెలిపింది. దేశంలో కరోనా బారినపడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ, కొలుకొంటున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 60.73 శాతానికి పెరిగిందని, దాంతో దేశవ్యాప్తంగా ప్రతీరోజు వేలాదిమంది రోగులు కోలుకొని ఇళ్లకు తిరిగి వెళుతున్నారని తెలిపింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 20,903 మందికి కొత్తగా కరోనా సోకగా, అదేసమయంలో 20,033 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. 

భారత్‌లో ప్రస్తుతం 6,35,022 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణకాగా వారిలో 2,31, 758 మందిని యాక్టివ్ కేసులుగా గుర్తించారు. అయితే యాక్టివ్ కేసుల కంటే కోలుకొన్నవారి సంఖ్య (3,84, 846 మంది) ఎక్కువగా ఉండటం చాలా శుభపరిణామమే. మొదట్లో కరోనా సోకితే తప్పకుండా చనిపోతారనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు లక్షల సంఖ్యలో కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇళ్ళకు తిరిగివెళుతున్నారు. ఇదంతా మన వైద్యులు, వైద్య సిబ్బంది కృషి, రోగులలో రోగనిరోధకశక్తి పెరగడంతోనే సాధ్యమైందని చెప్పవచ్చు. 

ఇప్పుడు కరోనా చికిత్సకు రెండు రకాల మందులు అందుబాటులోకి వస్తున్నాయి కనుక రానున్న రోజులలో రికవరీ రేటు మరింత పెరుగవచ్చు. ఇది చాలా శుభపరిణామమే కానీ కరోనా సోకకుండా నివారించేందుకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు కనుక దేశప్రజలందరూ అంతవరకు కరోనా జాగ్రతలన్నీ పాటిస్తే కొత్తగా కరోనా కేసులు నమోదవడం కూడా తగ్గిపోతుంది. అప్పుడు దేశం కరోనా నుంచి విముక్తి పొందగలదు. మళ్ళీ అందరూ సాధారణజీవితాలు గడుపుకోవచ్చు. భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 18,352 మంది కరోనాతో మృతి చెందారు.


Related Post