ప్రభుత్వాలకు మహమ్మారి...ప్రైవేట్ ఆసుపత్రులకు మహాలక్ష్మి

July 03, 2020


img

అవును... ప్రభుత్వాలు కరోనాను మహమ్మారిగా భావించి దాని నుంచి బయటపడేందుకు నానా బాధలుపడుతుంటే, అదే కరోనా మాకు ‘కాసులు కురిపించే మహాలక్ష్మి’ అంటున్నాయి హైదరాబాద్‌లోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు. ఎందుకంటే నగరంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో, కొంతమంది ధనవంతులు ముందు జాగ్రత్త చర్యగా కార్పొరేట్ ఆసుపత్రులలో రూములు అడ్వాన్స్ బుకింగ్ చేసుకొంటున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఓ రోజు కరోనా అంటుకొంటే ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స తీసుకోలేరు కనుక ఈవిధంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అటువంటి ధనికులతో ఎప్పుడూ టచ్చులో ఉండే కొన్ని ఆసుపత్రుల మార్కెటింగ్ బృందాలు వారికి ఫోన్‌ చేసి “వెంటనే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి ఆలసించిన ఆశాభంగం” అంటూ రూమ్స్, బెడ్స్ బుకింగ్స్ చేసుకొంటున్నాయిట! మరికొంతమంది రోజూ టీవీ, న్యూస్ పేపర్లలో వస్తున్న కరోనా వార్తలను చూసి ఆందోళనతో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి అవి చెప్పినంతా చెల్లించి కరోనా పరీక్షలు చేయించుకొని ఎందుకైనా మంచిదని అబ్జర్వేషన్‌లో ఉంటామని చేరిపోతుంటే ఏ ఆసుపత్రి మాత్రం కాదంటుంది?

నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రులలో ప్రత్యేక రూములకు, ప్రత్యేక బెడ్‌లకు డిమాండ్ పెరిగిపోతుండటంతో వాటి రేట్లు కూడా పెరిగిపోతున్నాయని తాజా సమాచారం.


Related Post