మళ్ళీ లాక్‌డౌన్‌ దిశలో రాష్ట్రాలు...నగరాలు

June 29, 2020


img

జూన్ 30న అన్‌లాక్‌-1 ముగిసి జూలై 1వ తేదీ నుంచి అన్‌లాక్‌-2 ప్రకారం మరిన్ని రంగాలపై లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించవలసి ఉండగా, కరోనా భయంతో ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలు, నగరాలు, పట్టణాలు, చివరికి మార్కెట్లు కూడా స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకొంటున్నాయి. హైదరాబాద్‌లో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నందున మళ్ళీ 15 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది.      

దేశంలోకెల్ల అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న మహారాష్ట్రలో జూలై 31వరకు లాక్‌డౌన్‌ కొనసాగించబోతున్నట్లు మహా ప్రభుత్వం ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్త చర్యగా జూలై నెలాఖరువరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడిగించింది. జూలై 1 నుంచి నెలాఖరువరకు రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. 

కర్ణాటకలో జూలై 5 నుంచి ప్రతీ ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుచేయబోతున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే జూలై 10 నుంచి నెలాఖరు వరకు శనివారం కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శలవు ప్రకటించింది.  

అసోంలోని కామరూప్ జిల్లాలో గత రెండు వారాలుగా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉంది. దానిని జూలై 12 వరకు పొడిగిస్తున్నట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది. మణిపూర్‌లో వచ్చే నెల 15వరకు లాక్‌డౌన్‌ పొదిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఝార్ఖండ్ రాష్ట్రంలో జూలై 1 నుంచి నెలాఖరువరకు లాక్‌డౌన్‌ పొడిగించారు.  

దేశంలో మహారాష్ట్ర, డిల్లీ తరువాత అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న తమిళనాడు రాష్ట్రంలో రాజధాని చెన్నైతో సహా నాలుగు జిల్లాలలో ఈ నెలాఖరువరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంది. లాక్‌డౌన్‌ విధించినప్పటికీ ఇంకా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కనుక ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నేడో రేపో లాక్‌డౌన్‌పై ప్రకటన చేయనుంది. 

కరోనా సోకకుండా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు దేశంలో కరోనా వ్యాపిస్తూనే ఉంటుంది కనుక ఈవిధంగా కొన్ని రోజులు లాక్‌డౌన్‌ విధించుకొని కరోనాను కట్టడి చేసుకోవడం, మళ్ళీ జీవనోపాధి కోసం అన్‌లాక్‌ చేసుకోవడం, మళ్ళీ కరోనా కేసులు పెరగగానే మళ్ళీ లాక్‌డౌన్‌ విధించుకోవడం బహుశః ఇకపై పునరావృతం కావచ్చు. కనుక ప్రజలు కూడా ఈ ఇబ్బందులకు అలవాటుపడక తప్పదు.     Related Post