దేశీయ ఉత్పత్తులనే కొనండి: ప్రధాని మోడీ

June 29, 2020


img

భారత్‌ భూభాగంపై కన్నేసి యుద్ధసన్నాహాలు చేస్తున్న చైనాకు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్దంగా ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ‘మన్ కీ బాత్‌’ (మనసులో మాట) రేడియో కార్యక్రమంలో చెప్పారు. ప్రధాని హోదాలో ఉన్నవారు సర్వసాధారణంగా చెప్పే మాటే ఇది. అయితే స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలకు పిలుపునివ్వడం ఆలోచించవలసిన విషయమే.

చైనాకు అడ్డుకట్టవేయడానికి చైనా వస్తువులను కొనుగోలుచేయడం మానుకోవాలని ప్రధాని హోదాలో నరేంద్రమోడీ చెప్పడం సరికాదు కనుక ఈవిధంగా పరోక్షంగా దేశప్రజలకు సూచించినట్లు భావించవచ్చు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలుచేయడం ద్వారా దేశాన్ని బలోపేతం చేయడంలో పాలుపంచుకొన్నట్లేనని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 

చైనా ఉత్పత్తులపై నిషేదం విధిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే కొన్ని అనూహ్యమైన సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయి కనుక కేంద్రప్రభుత్వం వెనకడుగు వేస్తోందనుకోవచ్చు. 

కనుక ఇప్పుడు దేశప్రజలే పూనుకొని చైనాకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఓ పక్క భారత్‌ భూభాగాలను ఆక్రమిస్తూ భారత్‌ సైనికులను కిరాతకంగా హత్యలు చేసి భారత్‌తో యుద్ధానికి సిద్దమవుతూనే మరోపక్క నిసిగ్గుగా భారత్‌లో తమ ఉత్పత్తులను అమ్ముకొని లాభాలు ఆర్జించాలనుకొంటోంది చైనా!

దేశ సరిహద్దులను కాపాడుకొనేందుకు మన సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుంటే, దేశప్రజలు చైనా వస్తువులను కొనుగోలు చేస్తుండటం మన సైనికుల త్యాగాలను అవహేళన చేస్తున్నట్లే. కనుక మన సైనికులు సరిహద్దుల వద్ద ప్రత్యక్ష పోరాటం చేస్తుంటే దేశప్రజలందరూ చైనా ఉత్పత్తులను కొనడం మానివేయడం ద్వారా చైనాపై ఆర్ధికయుద్ధం చేసి బుద్ది చెప్పవచ్చు.


Related Post