కరోనాతో చితికి పోతున్న హోటల్ ఇండస్ట్రీ

June 27, 2020


img

లాక్‌డౌన్‌ దెబ్బకు దేశవ్యాప్తంగా రోడ్డు పక్కన బళ్లపై టిఫిన్లు అమ్ముకోనేవారు మొదలు చిన్న, మద్యతరగతి, ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు అన్ని తీవ్రంగా నష్టాపోయాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎంత హోటల్‌కు అంత కష్టం...అంత నష్టం అన్నట్లయింది. కొంచెం పెద్ద హోటల్స్ పైకి చాలా డాబుగా కనిపిస్తున్నప్పటికీ లోలోన వాటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాటికి నిర్వహణఖర్చులకు సరిపడేంత ఆదాయం కూడా రాలేకపోతుండటంతో ఇంట్లో ఏనుగును తెచ్చిపెట్టుకొన్నట్లు మారింది. 

ఇక అద్దె భవనాలలో మీడియం స్థాయి హోటల్స్ నిర్వహిస్తున్నవారిలో లాక్‌డౌన్‌ సమయంలో వ్యాపారాలు లేకపోయినా, త్వరలోనే పరిస్థితులు చక్కబడుతాయనే ఆశతో అద్దెలు చెల్లించవలసిరావడం, వ్యాపారం లేకపోయిన నిర్వహణ వ్యయం, సిబ్బంది వెళ్ళిపోకుండా కాపాడుకొనేందుకు జీతాల చెల్లింపులతో చాలామంది యజమానులు దివాళా అయిపోయారు. ఇక వాటిలో పనిచేసేవారికి పని లేకపోవడంతో అష్టకష్టాలుపడుతూ సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినప్పటికీ కరోనా భయంతో ప్రజలు హోటల్స్ కు రావడం బాగా తగ్గించేయడంతో హోటల్స్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా హోటల్ సిబ్బందికి, హోటల్‌కు వచ్చే వినియోగదారులకు కరోనా సోకకుండా జాగ్రత్తపడటం కోసం తరచూ హోటల్ అంతా శానిటైజ్ చేయవలసిరావడం, భౌతికదూరం పాటించడం కోసం సగం టేబిల్స్ తొలగించవలసిరావడం వంటి అనేక కారణాలతో దేశంలో హోటల్ పరిశ్రమ దివాళా అంచులో కొట్టుమిట్టాడుతోంది. హోటల్స్ తెరుచుకొన్నప్పటికీ ఈ నేపధ్యంలో వాటి నిర్వహణ వ్యయం గుదిబండగా మారుతుండటంతో నేటికీ ఒకటొకటిగా హోటల్స్ మూతపడుతూనే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలలోనే ఈ మూడు నెలల్లోనే కనీసం 100కు పైగా మీడియం స్థాయి హోటల్స్, కేక్ షాపులు బంద్‌ అయ్యాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.  

అయితే వాటికి శాపంగా మారిన కరోనా...రోడ్డుపక్కన మొబైల్ వ్యాన్లలో, తోపుడుబళ్ళలో టిఫిన్స్, నూడుల్స్, బజ్జీలు వగైరాలు అమ్ముకోనేవారికి ఇప్పుడు వరంగా మారుతోంది. రోడ్ల పక్కన ఆహారపదార్ధాలు అమ్ముకొనేవారికి నిర్వహణభారం నామమాత్రంగానే ఉంటుంది కనుక వారు ఇప్పుడిప్పుడే కొలుకొంటున్నారు. 


Related Post