కరోనా రోగులకు మున్ముందు ఇళ్ళలోనే చికిత్స?

June 05, 2020


img

కరోనా మహమ్మారి భారత్‌లో శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం రోజుకు సుమారు 10,000 కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఆసుపత్రులు కరోనా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణలో కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చిన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో అన్ని బెడ్స్ కరోనా రోగులతో నిండిపోయాయి. కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రానున్న రోజులలో కరోనా రోగులకు చికిత్స చేసేందుకు దేశంలోని ఆసుపత్రులు సరిపోకపోవచ్చు కనుక వారి ఇళ్ళలోనే వైద్యం అందించేలా కేంద్రం నిన్న కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిని బట్టి మున్ముందు పరిస్థితులు ఏవిధంగా ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు. 

దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించిన కొత్తలో కరోనా రోగులు ఇళ్ళలో దాక్కోనేవారు. వారికి ఉచితంగా పరీక్షలు చేయించి ఆసుపత్రులకు తరలించేందుకు వచ్చే పోలీసులు, ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఎదురుదాడులు చేసేవారు. అయినప్పటికీ వారు చాలా ఓర్పుతో కరోనా రోగులను బ్రతిమాలి పరీక్షలు చేయించి, ఆసుపత్రులకు తరలించేవారు. కానీ దేశంలో కరోనా కేసులు లెక్కకు మించి పెరిగిపోతే అప్పుడు కరోనా రోగులు...వారి బందువులే తమకు పరీక్షలు చేయించమని, ఆసుపత్రులలో చేర్చుకోమని పోలీసులను, ఆరోగ్యశాఖ సిబ్బందిని బ్రతిమలాడే పరిస్థితి వస్తుందని, కానీ చేర్చుకోలేని పరిస్థితులు వస్తాయని రెండు నెలల క్రితమే మన వెబ్‌సైట్‌లో చెప్పుకొన్నాము. కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలను గమనిస్తే ఇప్పుడు అదే జరుగబోతోందని భావించవచ్చు. 

భారత్‌లో సుమారు 10-15 లక్షల రోగుల వరకు ఆసుపత్రులలో ఉంచి చికిత్స అందించగలదనుకొంటే, మరొక రెండు నెలల్లో ఆ సంఖ్యను చేరుకొనే అవకాశం ఉంది. ఆ తరువాత దేశంలో ఏ ఆసుపత్రులు ఖాళీ ఉండవు కనుక అప్పుడు కరోనా రోగులు ఇళ్ళలోనే ఉంటూ చికిత్స తీసుకోవలసి ఉంటుంది. 

ఒక గల్లీలో కరోనా రోగిని ఆసుపత్రికి తరలిస్తేనే జనం భయపడుతున్నప్పుడు, కరోనా రోగులను ఇళ్లలోనే ఉంచుకొని వారితోనే జీవించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే కనుక జరిగితే భారతీయుల ఆర్ధిక, సామాజిక జీవితాలు ఊహించలేనంత భయానకంగా మారే ప్రమాదం ఉంటుంది. కనుక అటువంటి భయానక పరిస్థితులు రాకూడదనుకొంటే ప్రజలందరూ మరింత బాధ్యతాయుతంగా మెలగవలసి ఉంటుంది. అప్పుడే కరోనా మహమ్మారి నెమ్మదిస్తుంది.


Related Post