జూన్ 8 నుంచి ఏపీలో హోటల్స్ ప్రారంభం

June 04, 2020


img

కేంద్రం జారీ చేసిన లాక్‌డౌన్‌ సడలింపుల మార్గదర్శకాల ప్రకారం ఈనెల 8వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హోటల్స్, రెస్టారెంట్లు తెరుచుకొనేనేదుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు ప్రకటన చేశారు. పుణ్యక్షేత్రాలలో, పర్యాటక ప్రాంతాలలో హోటల్స్ కూడా తెరుచుకోవచ్చునని చెప్పారు. ఏపీకి అనేక పర్యాటక ఆకర్షణ కేంద్రాలున్నందున ఆ రంగంపై ప్రత్యేకదృష్టి పెట్టి ప్రభుత్వ ఆదాయం పెంచుకొనేందుకు ప్రయత్నిస్తామని మంత్రి చెప్పారు. 

లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న అనేక రంగాలలో హోటల్స్, రెస్టారెంట్లు కూడా ఒకటి. దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించే హోటల్స్, రెస్టారెంట్లు రెండు నెలలుకు పైగా మూతపడటంతో లక్షలాదిమంది రోడ్డున పడ్డారు. చిన్న చిన్న హోటల్స్ కూడా మూతపడటంతో వాటి యజమానులు సైతం దివాళా తీసి అష్టకష్టాలు పడుతున్నారు. హోటల్స్ మూతపడటంతో వాటికి కూరగాయలు, పాలు, పప్పుపులు, నూనెలు, ఇతర నిత్యావసర సరుకులు సరఫరా చేసేవారు, వివిద రకాల సేవలు అందించేవారు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈవిధంగా ఒక రంగం మూతపడితే గొలుసుకట్టుగా దానిపైనే ఆధారపడిన లక్షలాదిమంది ఆర్ధికంగా నష్టపోతున్నారు. 

ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలలో హోటల్స్, రెస్టారెంట్లు తెరుచుకొంటుండటంతో వాటిల్లో పనిచేసేవారికి, వాటి యజమానులకు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినప్పటికీ కరోనా భూతం ఇంకా అందరినీ వెంటాడుతూనే ఉండటం చాలా ఆందోళన కలిగించే విషయమనే చెప్పుకోవచ్చు. హోటల్స్, రెస్టారెంట్లు కూడా దీనికి మినహాయింపు కాదు. ఇప్పటి వరకు లాక్‌డౌన్‌తో నష్టపోయిన హోటల్స్, రెస్టారెంట్లు ఇప్పుడు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ లాభసాటిగా కాకపోయినా సజావుగా వ్యాపారం చేసుకోవడం కత్తిమీద సామువంటిదే. అన్ని రంగాలకు ఇదో కొత్త సవాలే అని చెప్పవచ్చు. కనుక అన్ని రంగాలు దేనికవి ప్రత్యేకంగా వ్యూహాలు, విధివిధానాలు రూపొందించుకోవలసి ఉంటుంది. 


Related Post