నీమ్స్ వైద్యులకు కరోనా...పేషంట్ల డిశ్చార్జ్

June 03, 2020


img

హైదరాబాద్‌ నీమ్స్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు వైద్యులకు, ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈరోజు మధ్యాహ్నం నుంచి కార్డియాలజీ, గ్యాస్ట్రో విభాగాలలో రోగులను డిశ్చార్జ్ చేసి ఇళ్లకు పంపించి వేస్తున్నారు. ఆ రెండు విభాగాలలో పనిచేస్తున్న మొత్తం 70 మంది వైద్యులు, సిబ్బందికి ఈరోజు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా సోకిన వైద్యులు సిబ్బంది ఇప్పటివరకు ఎంతమందికి వైద్య సేవలు అందించారనే వివరాలను సేకరించి, ఆ రోగులను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నీమ్స్ లో కరోనా వైరస్‌ బయటపడటంతో ఈరోజు అన్ని విభాగాల అధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహించి ఆసుపత్రిలో మిగిలిన విభాగాలకు కరోనా వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?అనే అంశంపై లోతుగా చర్చించారు. ఇప్పటికే ఆసుపత్రికి వస్తున్న రోగులకు గేటు వద్దే ధర్మల్ స్క్రీనింగ్ చేసి, వారి పూర్తి వివరాలు నమోదు చేసుకొని కరోనా లేదని నిర్ధారించుకొన్న తరువాతే లోపలకు అనుమతిస్తున్నారు. ఇకపై ఆసుపత్రిలో ప్రవేశించే ముందు వైద్యులు, సిబ్బందికి కూడా ధర్మల్ స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు.         

ఆసుపత్రులలో వైద్యులకు, సిబ్బందికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. కనుక వారు మరింత జాగ్రత్తగా ఉండకతప్పదు. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొన్న తరువాత కూడా ఏదోవిధంగా వారికి కరోనా సోకితే, ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో అర్ధం చేసుకోవడానికి ఇది పనికివస్తుంది. కనుక అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్కులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో సిబ్బంది, రోగులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Related Post