ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మొట్టికాయలు

June 03, 2020


img

ఏపీలో జగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాలతో ప్రజలను ఎంతగా ఆకట్టుకొంటోందో వివాదాస్పద నిర్ణయాలతో అంతగానే విమర్శలు, ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేసినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కు తగ్గకపోవడంతో దానిపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని తదితరులను హైకోర్టుకు రప్పించుకొని గట్టిగా మందలించింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తక్షణం తొలగించాలని ఆదేశించింది. 

కానీ జగన్ ప్రభుత్వం వాటిని తొలగించకుండా వాటి కింద మరో రంగు జోడించి చేతులు దులుపుకొంది. దాని కోసం ఓ జీవో (నెంబర్: 623)ని కూడా జారీ చేసింది. పైగా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ కూడా వేసింది. 

దానిపై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కూడా ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. హైకోర్టు విస్పష్టంగా తీర్పు చెప్పినప్పటికీ దానిని అమలుచేయకుండా మళ్ళీ కొత్తగా జీవో జారీ చేయడం, ఉన్న రంగులకు మరో రంగు జోడించడం చాలా తప్పని తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశించినట్లుగా నాలుగు వారాలలోగా ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులు తొలగించాలని లేకుంటే కోర్టుధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది. 

ప్రభుత్వమే ఇటువంటి అసంబద్దమైన పనులు చేయడం, దాని కోసం ఓ జీవో జారీ చేయడం, హైకోర్టు హెచ్చరించినా పట్టించుకోకపోవడం, హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, అక్కడ మొట్టికాయలు వేయించుకోవడం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేవే కదా?అయినా సంక్షేమ పధకాలతో ప్రజలలో మంచిపేరు సంపాదించుకొంటున్నపుడు, ప్రజలను ఆకర్షించడానికో లేదా ప్రభావితం చేయడానికో ఇటువంటి పనులు చేయడం అవసరమా? అని జగన్ ప్రభుత్వం ఆలోచించుకొంటే బాగుంటుంది.


Related Post