రెండులక్షలు దాటిన కరోనా కేసులు

June 03, 2020


img

భారత్‌లో మంగళవారంనాటికి కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటిపోయింది. ఈరోజు ఉదయానికి దేశవ్యాప్తంగా 2,07,615 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పుడు దేశంలో రోజుకు 9,000 కొత్త కేసులు నమోదవుతుండటంతో మున్ముందు పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో తలుచుకొంటేనే భయం వేస్తుంది. 

ఆ రెండు లక్షలమందిలో ఇప్పటి వరకు 1,00,304 మంది కోలుకోవడం చాలా గొప్ప విషయమే కానీ మరో 1,01,497 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా ఇదే సమయంలో ప్రతీరోజు కొత్తగా 9,000 మంది రోగులు వచ్చి చేరుతుండటం చాలా ఆందోళనకరమైన విషయమే. 

ఈ లెక్కన 10 రోజులలో సుమారు లక్షమంది వచ్చి చేరుతారు కనుక అంతమందికి ఒకేసారి చికిత్స అందించగలిగే సామర్ధ్యం మన ఆసుపత్రులకు ఉందా?రెండు నెలలుగా తీవ్ర ఒత్తిడిని భరిస్తూ కరోనా రోగులకు చికిత్స చేస్తూ అలసిపోయున్న మన వైద్యులు, వైద్య సిబ్బంది ఇదేవిధంగా ఇంకా నెలల తరబడి అంతమందికి చికిత్స అందించగలరా?చేయలేకపోతే ఏమవుతుంది? ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే కరోనా రోగులున్నారు కనుక ప్రభుత్వాలు వారందరికీ ఉచితంగా పరీక్షలు, చికిత్సలు చేయిస్తున్నాయి. కానీ మున్ముందు లక్షల సంఖ్యలో రోగులు వస్తే అప్పుడూ ఇదేవిధంగాఉచితంగా పరీక్షలు, చికిత్సలు చేయించగలవా? చేయించలేకపోతే దేశంలో కోట్లాది నిరుపేదలు, మద్యతరగతి ప్రజల పరిస్థితి ఏమిటి?ఇంట్లో నుంచి బయటకు వెళితే కరోనా సోకుతుందని భయం పట్టిపీడిస్తుంటే ప్రజలు తమ పనులు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏవిధంగా చేసుకోగలరు?వంటి జవాబులు లేని అనేక ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. 

రాష్ట్రాలలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నా ప్రజలు ఆందోళన చెందనవసరంలేదని ప్రభుత్వాలు సముదాయిస్తున్నాయి. కానీ ఎవరికివారు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు, వైద్యులు, వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్య కార్మికులు, ఆరోగ్యశాఖ కార్యకర్తలు చేయగలిగినంతా చేశారు. కనుక ఇకపై కరోనా వైరస్‌ సోకకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత ప్రజలదేనని గుర్తుంచుకొని మెలగాలి. లేకుంటే దానికి వారే బలవక తప్పదు. 


Related Post