ప్రధాని మోడీకి సిఎం కేసీఆర్‌ లేఖ

June 03, 2020


img

కేంద్రప్రభుత్వం విద్యుత్ చట్టంలో ప్రతిపాదిస్తున్న సవరణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ వ్రాశారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న ఈఆర్సీలపై కేంద్రం పెత్తనం చలాయించాలనుకోవడం ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని అన్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ సవరణలు అమలులోకి వస్తే రాష్ట్రాలలో విద్యుత్ సంస్థలు, సామాన్య ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారని కనుక ‘ముసాయిదా విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు–2020’ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సిఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

“కేంద్రమే లబ్దిదారులకు విద్యుత్ రాయితీలను నగదు బదిలీ ద్వారా అందజేయాలనే ప్రతిపాదన వలన రాష్ట్రాలలో విద్యుత్ సంస్థలలో.. వినియోగదారులలో గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చు. విద్యుత్ రాయితీలలో ‘క్రాస్ సబ్సీడీ’ ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. దాని వలన పేద ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతారు. రాష్ట్రాలలో జల వనరులు, అవసరాలను బట్టి పునరుత్పాదక ఇందన విధానం అమలుచేసుకొనే హక్కు, అధికారాలు రాష్ట్రాలకే ఉండాలి. ఈ విషయంలో కేంద్రం జోక్యం తగదు. రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే ‘పవర్ షెడ్యూలింగ్’ విధానం సరికాదు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపుల విషయంలో కేంద్రం జోక్యం సరికాదు. వినియోగదారులు ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న డిస్కంల నుంచి విద్యుత్ పొందుతున్నారిప్పుడు. కానీ కానీ కేంద్రం ప్రతిపాదిస్తున్న ‘ఓపెన్ యాక్సెస్’ విధానంలో బయట ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకొనేందుకు వినియోగదారులను అనుమతించినట్లయితే డిస్కంలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈఆర్సీల నియామకం విషయంలో కేంద్రం జోక్యం, పెత్తనం చేయాలనుకోవడం సరికాదు,” అంటూ సిఎం కేసీఆర్‌ లేఖలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కనుక ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. 


Related Post