సీ ఓటర్ సర్వే నమ్మశక్యమేనా?

June 03, 2020


img

ఇది సర్వేల ర్యాంకుల యుగం. కనుక నిత్యం ఏదో ఓ అంశం మీద ఏదో ఓ సంస్థ సర్వేలు చేస్తూనే ఉంటుంది.. నివేదికలు ప్రకటిస్తూనే ఉంటుంది. అయితే చాలాసార్లు అవి ప్రకటించిన నివేదికలను చూసినప్పుడు వాటి ప్రామాణికతపై సందేహాలు వ్యక్తం అవుతుంటాయి. తాజాగా ‘సీ ఓటర్‌ మరియు ఐఏఎన్‌ఎస్‌ కలిసి దేశవ్యాప్తంగా ఓ సర్వేను చేపట్టాయి. ప్రధాని నరేంద్రమోడీ గురించి వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు గురించి దేశ ప్రజలు ఏమనుకొంటున్నారు? అనే రెండు ప్రశ్నలతో ఈ సర్వే నిర్వహించి ఫలితాలు ప్రకటించాయి. 

మోడీకి జైకొట్టిన రాష్ట్రాలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఏపీలో 83.6 శాతం మంది, తెలంగాణలో 71.51, కర్ణాటకలో 82.56, కేరళలో 32.15, తమిళనాడులో 32.89 శాతం మంది  మోడీ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. దేశం మొత్తంగా చూస్తే 62 శాతం మంది మోడీ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది.

ప్రధాని నరేంద్రమోడీ పట్ల మొదటి నుంచి దేశప్రజలలో భిన్నాభిప్రాయాలున్నాయనే సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఆర్ధిక సమస్యలలో చిక్కుకుపోయి సతమతమవుతున్న రాష్ట్రాలను ఆడుకోవడంలో కేంద్రం వైఫల్యం చెందిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా అనాలోచితంగా లాక్‌డౌన్‌ ప్రకటించి దేశంలో కోట్లాదిమంది నిరుపేదలను, వలస కార్మికులను రోడ్డునపడేసిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తూనే ఉన్నాయి. ఇపుడు దేశంలో శరవేగంగా కరోనా కేసులు మళ్ళీ పెరిగిపోతుండటంతో కరోనాను కట్టడి చేయడంలో కూడా కేంద్రం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ పరిస్థితులలో ఇటువంటి సర్వే ఫలితాలు ప్రకటించి ఉంటే నమ్మశక్యంగానే ఉండేది కానీ ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ పాలన పట్ల 62 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పడమే విచిత్రంగా ఉంది. 

ఇక ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాధారణ గురించి మాట్లాడుకోవలసివస్తే ఆ జాబితాలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ పేరు మొదటి మూడు స్థానాలలో తప్పక ఉంటుందని ఎవరైనా చెపుతారు. కానీ ‘సీ ఓటర్‌ మరియు ఐఏఎన్‌ఎస్‌ సర్వేలో ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి 4వ స్థానంలో ఉండగా తెలంగాణ సిఎం కేసీఆర్‌ 16వ స్థానంలో ఉన్నట్లు చెప్పడం చూస్తే ఆ సర్వే ప్రామాణికతపై సందేహాలు కలుగకమానవు. తెలంగాణలో 54.26 శాతం మంది ప్రజలు మాత్రమే సిఎం కేసీఆర్‌ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని సర్వేలో పేర్కొంది. 

ఆ సర్వేలో ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ (82.96శాతం) మొదటిస్థానంలో ఉండగా, ఆ తరువాత స్థానాలలో వరుసగా ఛత్తీస్ ఘడ్ సిఎం భూపేష్‌ భగేల్ (81.06 శాతం), కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌(80.28శాతం), ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి (78.01 శాతం), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే(72.56 శాతం), ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (74.18 శాతం) ప్రజాధారణ కలిగిన సీఎంలని ‘సీ ఓటర్‌ మరియు ఐఏఎన్‌ఎస్‌’ పేర్కొన్నాయి. 

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 72,500 కరోనా కేసులు, 2,465 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే నేడు 42,216 కేసులు నమోదు కాగా వాటిలో 23,635 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో దేశ ఆర్ధిక రాజధానిగా చెప్పుకోబడుతున్న ముంబై పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. మహారాష్ట్ర సిఎం ఉద్దవ్‌ థాక్రే కరోనాను కట్టడి చేయడంలో దారుణంగా వైఫల్యం చెందారని స్పష్టం అవుతుంటే, మహారాష్ట్రలో 72.56 శాతం ప్రజలు ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ‘సీ ఓటర్‌ మరియు ఐఏఎన్‌ఎస్‌’ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.


Related Post