రాష్ట్రంలో హైదరాబాద్‌ కరోనా కేంద్రంగా మారబోతోందా?

June 03, 2020


img

రాష్ట్రానికి హైదరాబాద్‌ గుండెకాయ వంటిది. దానికే కరోనా వైరస్ సోకితే? జిహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో  ప్రతీరోజు కొత్తగా 80-90 కరోనా కేసులు బయటపడుతుండటం చూస్తే రాష్ట్రంలో హైదరాబాద్‌ కరోనా కేంద్రంగా మారబోతోందా?హైదరాబాద్‌లో కరోనా కేసులు ఇదేవిదంగా పెరుగుతుంటే మళ్ళీ జిల్లాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని జిల్లాలలో పెరుగుతున్న కేసులు నిరూపిస్తున్నాయి. 

గడిచిన 24 గంటలలో జీహెచ్‌ఎంసీ 70, రంగారెడ్డి-7, మేడ్చల్-3, నల్గొండ-2, సిద్ధిపేట, మంచిర్యాల, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి జిల్లాలో ఒక్కో కలిపి మొత్తం 87 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఇవి కాక 12 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. దీంతో మంగళవారం రాత్రి 9 గంటలకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,445కి చేరింది. విదేశాల నుంచి తిరిగివచ్చినవారు, వలస కార్మికులలో ఇప్పటి వరకు 446 కేసులు నమోదయ్యాయి. వారిని కూడా కలుపుకొంటే 2,891 పాజిటివ్ కేసులయ్యాయి. 

మంగళవారం 35 మంది కరోనా రోగులు కోలుకొని ఇళ్లకు తిరిగివెళ్లారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,526 మంది        కరోనా నుంచి కోలుకొన్నట్లయింది. మంగళవారం నలుగురు వ్యక్తులు కరోనాతో చనిపోయారు. వారందరూ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 92కి చేరింది. 

సోమవారం వరకు రాష్ట్రంలో 12 జిల్లాలు కరోనారహితంగా ఉండగా, జిల్లాలలో కొత్తగా నమోదైన కేసులతో ఆ సంఖ్య 8కి పడిపోయింది. ప్రస్తుతం సిరిసిల్లా, జైశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌, గద్వాల జిల్లాలు మాత్రమే కరోనా రహితంగా ఉన్నాయి. 


Related Post