అభివృద్ధికి చిరునామాగా మారిన తెలంగాణ

June 02, 2020


img

దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంటుంది. ఎన్నో కొన్ని సంక్షేమ పధకాలు అమలవుతూనే ఉంటాయి. అయితే వాటి అమలులో పట్టుదల, నిబద్దత, దూరదృష్టి లోపించడం వలన వేలకోట్లు ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించవు. కానీ ఆరేళ్ళ క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి సత్ఫలితాలను సాధించి చూపుతోంది. అందుకే తెలంగాణ రాష్ట్రం దేశంలో అభివృద్ధికి చిరునామాగా మారింది. దాంతో వివిద రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో నిపుణులు, కార్మికులు రాష్ట్రానికి వచ్చి ఉద్యోగం, ఉపాది పొందుతున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో పరిస్థితులు మారుతుండటంతో గతంలో పొట్ట చేత్తో పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు పోయిన కార్మికులు కూడా రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. 

తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో దాదాపు అన్ని రంగాలు నిర్వీర్యంగా ఉండేవి. అటువంటి పరిస్థితులలో ఏదో ఒక రంగాన్ని గాడినపెట్టడమే చాలా కష్టం కానీ సిఎం కేసీఆర్‌ ప్రతీ రంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులు, రాష్ట్ర అవసరాలను బట్టి దేనికి దానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ఎన్ని అడ్డంకులు, సవాళ్ళు ఎదురైనా వెనక్కు తగ్గకుండా ధైర్యంగా ముందుకే సాగి సత్ఫలితాలు సాధించారు. ఒకవేళ ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలకు భయపడి వెనక్కు తగ్గి ఉండి ఉంటే నేడు తెలంగాణ కూడా ఇతర రాష్ట్రాలలాగే మూడడుగులు ముందుకి ఆరడుగులు వెనక్కు అన్నట్లు సాగుతుండేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసమే పోరాడి తెలంగాణ సాధించుకొన్నామనే సంగతి సిఎం కేసీఆర్‌ ఏనాడూ మరువలేదు. కనుక ఆ మూడు రంగాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టి వాటికి ఉన్న అవరోధాలను ఒకటొకటిగా తొలగించుకొంటూ ముందుకు సాగి ఆశించిన ఫలితాలు సాధించారు.  

నీళ్ళు: అధికారంలోకి రాకమునుపే రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలనే దానిపై కేసీఆర్‌కు పూర్తి స్పష్టత ఉంది. అలాగే రాష్ట్రంలో భౌగోళిక పరిస్థితులు, వ్యవసాయం, జలవనరులపై పూర్తి అవగాహన కలిగి ఉన్నందున రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రంలో వ్యవసాయరంగంలో సమూలమైన మార్పులు తేగలిగారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు కూడా విద్యుత్ మూలాధారం కనుక ముందుగా ఆ సమస్యనే పరిష్కరించడంతో తొలి అవరోదం తొలగిపోయి అభివృద్ధికి మార్గం సుగమం అయ్యిందని చెప్పవచ్చు.   

ఉద్యోగాలు: రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు కనుక రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పార్కు, వైద్య పరికరాల పార్క్‌, ఫార్మా పరిశ్రమల పార్క్, చిన్న పరిశ్రమలకు వేరేగా మరో ఇండస్ట్రియల్ పార్క్‌...ఇలా రాష్ట్రంలో ఉన్న వనరులు, అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక కారిడర్లు ఏర్పాటు చేయడం వలన భారీగా చిన్నా పెద్ద పరిశ్రమలు తరలివచ్చాయి. అలాగే ఐ‌టి రంగం రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా అని ముందే గుర్తించినందున మరిన్ని ఐ‌టి కంపెనీలను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్‌ చేయని ప్రయత్నం లేదు. వాటి కోసమే ప్రత్యేకంగా పారిశ్రామిక పాలసీ,  ఐ‌టి పాలసీలను రూపొందించి ఖచ్చితంగా అమలుచేసి సత్ఫలితాలను సాధిస్తున్నారు. 

నిధులు: కేంద్రం నుంచి తెలంగాణకు న్యాయంగా రావలసిన నిధులు రాబట్టుకోవడానికి ఓ పక్క గట్టిగా పోరాడుతూనే, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా తన కాళ్లపై తాను నిల్బది స్వయంసంవృద్ధి సాధించేలా చేయాలని సిఎం కేసీఆర్‌ ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. రాష్ట్రంలో నెలకొన్న ఈ ఉత్సాహకరమైన, స్నేహపూర్వకమైన వాతావరణం చూసి దేశవిదేశాలకు చెందిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐకియా వంటి అనేక సంస్థలు తెలంగాణకు తరలివస్తున్నాయి. అటువంటి పెద్ద సంస్థలు వస్తున్నాయంటే అక్కడ వ్యాపారానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉందనే అర్ధం కనుక వాటి వెనుకే చిన్న, మద్యతరహా పరిశ్రమలు కూడా తరలివస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు వస్తుండటంతో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాది అవకాశాలు కూడా భారీగా పెరిగాయి. వాటితో ఓ పక్క లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాది లభిస్తుంటే, అవి చెల్లించే పన్నుల ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా భారీగా పెరిగింది. 

ఒకవేళ కరోనా రాకపోయుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చే 5 ఏళ్ళలోగా దేశంలోనే నెంబర్ :1 స్థానంలో నిలిచి ఉండేది. కరోనా... లాక్‌డౌన్‌ కారణంగా అభివృద్ధి కుంటుపడినప్పటికీ, రాష్ట్రంలో అభివృద్ధి జరిగేందుకు అవసరమైన విధానాలు, సంస్థలు, పరిశ్రమలు అన్నీ సిద్దంగానే ఉన్నందున త్వరలోనే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కోలుకొని అభివృద్ధిపదంలో దూసుకుపోవడం ఖాయం.


Related Post