తెలంగాణలో ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటి?

June 02, 2020


img

తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం చలాయించిన కాంగ్రెస్‌ పార్టీ క్రమంగా బలహీనపడింది. కేంద్రంలో బిజెపియే అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఎదగలేకపోతోంది. వామపక్షాలు మరింత బలహీనపడ్డాయి. టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జనసమితితో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినప్పటికీ ప్రజలు ఆదరించలేదు. టిఆర్ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొలేమని భావించిన ప్రతిపక్షాలు కూటములుగా ఏర్పడి ఎన్నికలలో పోరాడినప్పటికీ టిఆర్ఎస్‌ను ఓడించలేకపోయాయి. 

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ 3, బిజెపి 4 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ఒక్కటే కాస్త భిన్నమైన రాజకీయపరిణామంగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్‌, బిజెపిలు 7 ఎంపీ సీట్లు గెలుచుకొన్నప్పటికీ రాష్ట్రంలో పుంజుకోలేకపోవడం మరో విచిత్రం. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో టిఆర్ఎస్‌ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగగా ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం పోరాడుతున్నట్లు అర్ధం అవుతుంది. 

ఈ పరిస్థితికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

తెలంగాణ అభివృద్దే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్న సిఎం కేసీఆర్‌, ప్రతిపక్షాలు బలపడి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ మొదటికొస్తాయనే ఆలోచనతో లేదా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనో ప్రతిపక్షాలను చావుదెబ్బ తీసి బలహీనపరచడం. 

దశాబ్ధాలుగా వివక్షకు గురైన తెలంగాణ ప్రజలు, తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు తొలి అవకాశం ఇవ్వడంతో ఆయన దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపి ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. ప్రజలు కోరుకొంటున్న అభివృద్ధి, సంక్షేమం రెండూ ఆయన చేసి చూపుతున్నారు కనుక ప్రతిపక్షాలతో ఆయన ఏవిధంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో టిఆర్ఎస్‌...సిఎం కేసీఆర్‌తో ప్రతిపక్షాలు ఎంతగా పోరాడుతున్నప్పటికీ వాటికి ప్రజల మద్దతు లభించడం లేదు. 

ప్రజాధారణ, నమ్మకం పొంది టిఆర్ఎస్‌ తిరుగులేని శక్తిగా నిలువగా, అవి కోల్పోవడంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలహీనపడ్డాయని చెప్పవచ్చు. కనుక టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంకా ఎంతకాలం ఎంత సమర్ధంగా నడిపించగలిగితే అంతకాలం దానికి తిరుగు ఉండదని భావించవచ్చు. కనుక అప్పటి వరకు ప్రతిపక్షాలు ఓపికగా ఎదురుచూడక తప్పదు. కానీ అంతవరకు అవి మనుగడ సాగించగలవా? 


Related Post