తెలంగాణ ఇవ్వడం వరమా?

June 01, 2020


img

రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. కరోనా కారణంగా ఈసారి నిరాడంబరంగా వేడుకలు జరుపుకోవాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని బహుమతిగా ఇస్తే దానిని కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అనుభవిస్తోందని, వారు తప్ప రాష్ట్రంలో ఎవరూ బాగుపడలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఇంకా చాలా అంశాలపై తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేశారు. ఎన్నికల హామీలు అమలుచేయనందుకు తీవ్ర విమర్శలు చేశారు. 

ఈ విమర్శలు, ఆరోపణలను కాసేపు పక్కన పెడితే రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని బహుమతిగా ఇచ్చారనే’ కాంగ్రెస్‌ నేతల వాదన సబబా కాదా? అని చర్చించాల్సి ఉంది.

 ‘సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు’ అని కాంగ్రెస్‌ నేతలు పదేపదే చెప్పుకోవడం ఆనాడు ప్రధానమంత్రిగా వ్యవహరించిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కించపరచడమే అవుతుందని కాంగ్రెస్‌ నేతలు భావించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే, ఆనాడు సోనియా గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలే తప్ప ఇటువంటి కీలక నిర్ణయాలను తీసుకొనే అధికారం ఆమెకు లేదు. కానీ ఆమె డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి వెనుక నుంచి ప్రభుత్వాన్ని నడిపించారనేది అందరికీ తెలిసిన రహస్యమే. అందుకే ‘సోనియా గాంధీయే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు వరంగా ఇచ్చారని’ కాంగ్రెస్‌ నేతలు పదేపదే చెప్పుకొంటున్నారు. కానీ వారు ఆవిధంగా చెప్పుకోవడం ద్వారా తమ ప్రధాని ‘ఓ డమ్మీ’ అని వారే స్వయంగా చాటింపు వేసుకొంటున్నారు. అది వారి పార్టీకి గౌరవప్రదం కానప్పటికీ సోనియా గాంధీని స్తుతించడమే ముఖ్యమని కాంగ్రెస్‌ నేతలందరూ భావిస్తుంటారు కనుకనే పదేపదే ఈవిధంగా అనగలుగుతున్నారనుకోవచ్చు.  

తెలంగాణ ప్రజలు, రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమై సుమారు దశాబ్ధంపాటు ఏకధాటిగా పోరాటం చేసి, అనేకమంది యువకులు బలిదానాలు చేసుకొన్న తరువాత రాష్ట్రాన్ని ఇవ్వడం వరం లేదా బహుమతి అని చెప్పడం వారి పోరాటాలను, బలిదానాలను అవమానించడమే అవుతుంది. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోవడం, సరిగ్గా అదేసమయానికి సార్వత్రిక ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని లాభనష్టాల లెక్కలు కట్టుకొన్న తరువాతే తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించిందనే సంగతి అందరికీ తెలుసు. ఒకవేళ ప్రజలకు రాష్ట్రాన్ని బహుమతిగా ఇవ్వాలనుకొంటే వారు ఉద్యమాలు చేయకమునుపే ఇచ్చి ఉండాలి తప్ప విధిలేని పరిస్థితులలో కాదు కదా? ఒకవేళ వారు దానిని నిజంగా వరమని భావిస్తున్నట్లయితే దానికి ప్రతిఫలం ఆశించడం ఎందుకు? ఆశిస్తే అది వరం ఎలా అవుతుంది? 


Related Post