రేవంత్‌ రెడ్డికి ఇస్తే ఊరుకొను: జగ్గారెడ్డి

June 01, 2020


img

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలో నేతలు పదవుల కోసం కీచులాడుకొంటూనే ఉంటారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై కాంగ్రెస్‌ అధిష్టానం కొంచెం కసరత్తు కూడా చేసింది. కానీ ఆ తరువాత కరోనా...లాక్‌డౌన్‌ వచ్చిపడటంతో మళ్ళీ ఆ ప్రస్తావనే చేయలేదు. దాంతో నేటికీ పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. 

కానీ ఆ పదవికోసం పార్టీలో నేతలు తెరవెనుక ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటూనే ఉన్నారు. ఆ పదవిని ఆశిస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,  సీనియర్ నేత వి.హనుమంతరావు తదితరులు తమ మనసులో మాటను బహిరంగంగానే చెపుతున్నారు. ఆ పోటీలో ఉన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మాత్రం ఏనాడూ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడలేదు కానీ తెర వెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని జగ్గారెడ్డి తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. 

జగ్గారెడ్డి ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చాలా బలమైన నాయకుడు పార్టీని చాలా చక్కగా నడిపిస్తున్నారు. ఆయనను మార్చాల్సిన పనిలేదు. కానీ ఒకవేళ ఆయన స్థానంలో రేవంత్‌ రెడ్డిని నియమించాలనుకొంటే నేను తప్పకుండా అడ్డుకొంటాను. అందుకు నేను చేయవలసిన రాజకీయాలు చేస్తాను. ముందస్తు ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అందరినీ ఒంటిచేత్తో గెలిపిస్తానని గొప్పలు చెప్పిన రేవంత్‌ రెడ్డే ఓడిపోయారు. అటువంటి వ్యక్తి పార్టీని ఏవిధంగా నడిపించగలరు? ప్రస్తుత పరిస్థితులలో పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించడం మంచిదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.


Related Post