భారత్‌లో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

June 01, 2020


img

తెలంగాణ రాష్ట్రంలో నాలుగైదు రోజుల క్రితం వరకు 28 జిల్లాలు కరోనా రహితంగా ఉండేవి. ఇప్పుడు వాటిలో 14 జిల్లాలలో కరోనా కేసులు బయటపడ్డాయి. పది రోజుల క్రితం దేశవ్యాప్తంగా రోజుకు 3-4,000 పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ఇప్పుడు రోజుకు 8-9,000 కేసులు నమోదవుతున్నాయి. పదిరోజుల క్రితం ప్రపంచదేశాలలో భారత్‌ 11వ స్థానంలో ఉండేది కానీ ఇప్పుడు 7వ స్థానానికి చేరుకొంది. నానాటికీ పెరుగుతున్న ఈ కేసులు, ఈ గణాంకాలన్నిటినీ చూస్తుంటే ఒకటిరెండు నెలలోపుగానే భారత్‌ అత్యంత ప్రమాదకర పరిస్థితికి చేరుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌లో ఇంతవరకు కట్టడిలో ఉన్న కరోనా మళ్ళీ ఎందుకు ఇంతవేగంగా వ్యాపిస్తోంది? అని ప్రశ్నించుకొంటే దానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 

1. ఆర్ధిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ఆంక్షల సడలించడం.  

2. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలించడంతో రెండు నెలల గృహనిర్బందంలో విసుగెత్తిపోయున్న ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకుండా రోడ్లపై యధేచ్చగా తిరుగుతుండటం. ముఖ్యంగా మార్కెట్లలో భౌతికదూరం పాటించకుండా వేలాదిమంది గుమిగూడుతుండటం. 

3. గత రెండు నెలలుగా రేయనక, పగలనక రోడ్లపైనే ఉంటూ విధులు నిర్వహిస్తూ అలసిపోయున్న పోలీసులు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజలను కట్టడిచేయలేకపోతుండటం. 

4. కరోనా ప్రభావిత దేశాలు, రాష్ట్రాలలో చిక్కుకుపోయి వెనక్కుతిరిగివస్తున్న వారిలో భారీగా కరోనా కేసులు. 

5. కరోనా ప్రభావిత ప్రాంతాల నుంచి కరోనా తక్కువగా ఉన్న ప్రాంతాలకు రైళ్ళు, విమానాలు నడిపిస్తుండటం. 

ఇలా చెప్పుకొంటూ పోతే చాలా కారణాలే కనిపిస్తాయి. అయితే ప్రభుత్వాలు ఎంతగా మొత్తుకొంటున్నప్పటికీ ప్రజలు కూడా బాద్యాతాయుతంగా వ్యవహరించితేనే ఈ మహమ్మారిని కట్టడి చేయగలము లేకుంటే మున్ముందు అన్ని రాష్ట్రాలలో భయానకమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. 



Related Post