కాళేశ్వరంకు ఆ హామీ ఇవ్వలేము: కిషన్ రెడ్డి

May 30, 2020


img

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయరులోకి నిన్న నీళ్ళు విడుదల చేసిన సిఎం కేసీఆర్‌, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం, దాని వలన రాష్ట్రానికి కలుగుతున్న మేలు గురించి సుదీర్గంగా మాట్లాడారు. అటువంటి గొప్ప ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం జాతీయహోదా కల్పించాలని పదేపదే కోరుతున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడంలేదని సిఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. 

దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందిస్తూ, “రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చినందున దానిని అమలుచేశాము. దేశంలో చాలా రాష్ట్రాలలో చాలా ప్రాజెక్టులున్నాయి. వాటన్నిటికీ  జాతీయహోదా ఇవ్వలేదు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయహోదా కల్పిస్తామని మేము హామీ ఇవ్వలేదు. కనుక దానిపై మమ్మల్ని నిందిస్తుండటం సమంజసం కాదు. ఒకవేళ దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకైనా కొత్తగా జాతీయహోదా కల్పించాలని కేంద్రం భావిస్తే అప్పుడు నేను తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని పట్టుబడతాను,” అని అన్నారు. 

నిజానికి తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి కేంద్రప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నందున, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధించడానికి గట్టిగా కృషి చేస్తారని ఆశించడం సహజం. కానీ హామీ ఇస్తేనే ప్రాజెక్టుకు జాతీయహోదా ఇస్తామని చెప్పడం భావ్యంగా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణ రాష్ట్రానికి, దాని కింద రాష్ట్రంలో పండించే పంటలతో దేశానికి కలుగుతున్న మేలు లేదా ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకొని జాతీయహోదా ఇవ్వాలని ఆయన కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే అందరూ హర్షించేవారు.  

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇస్తే దాని నిర్మాణవ్యయంలో కొంత భారాన్ని కేంద్రప్రభుత్వం భరించవలసి వచ్చేది. ఎన్నికల సమయంలో రాష్ట్రాలకు అనేక హామీలు, వేలకోట్లు విలువచేసే ప్రాజెక్టులను వరాలుగా ప్రకటిస్తున్నప్పుడు, దాదాపు నిర్మాణం పూర్తయి అద్భుతమైన ఫలితాలను ఇస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించడానికి ఏమి కష్టం?

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా దానికోసం పట్టుబడతాయనే కేంద్రం వాదన సరైనది కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే, వేలకోట్లు ఖర్చుచేసి ఎంతో పట్టుదలగా అకుంటిత దీక్షతో కృషి చేస్తే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టువంటివి నిర్మించడం సాధ్యం కాదు. కనుక ఇంజనీరింగ్ అద్భుతమని కేంద్రప్రభుత్వమే ప్రశంశిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చి ప్రోత్సహిస్తే అది అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా సంతోషిస్తారు కదా!


Related Post