హైదరాబాద్‌లో నేడు, రేపు ఎలిజా పరీక్షలు

May 30, 2020


img

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితులను, కారణాలను కనుగొనాలని ఐసిఎంఆర్, ఎన్ఐఎన్ సంకల్పించాయి. దీని కోసం దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అన్ని ప్రధాన నగరాలలో కంటెయిన్మెంట్ జోన్లలో ఎలిజా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాయి.  దీని కోసం డిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం శని, ఆదివారం రెండురోజులపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో పర్యటించి 500 మంది నుంచి రక్తం నమోనాలను సేకరిస్తోంది.  

సాధారణంగా కరోనా సోకితే దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు స్పష్టంగా కనబడతాయి కనుక ఆ రోగిని గుర్తించడం సులువు. కానీ ఆరోగ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులలో కరోనా వైరస్‌ సోకినప్పటికీ ఎటువంటి లక్షణాలు కనబడటం లేదు. కరోనా సోకిన విషయం వారికి తెలియకుండానే దాని నుంచి వారు       బయటపడుతున్నారు. ఎటువంటి మందులు, చికిత్స పొందకుండానే కరోనా నుంచి విముక్తి పొందడం చాలా శుభపరిణామమే. కానీ వారికి తెలియకుండానే వారి ద్వారా రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి కరోనా వ్యాపిస్తుండటమే తలనొప్పి వ్యవహారంగా మారింది. 

కనుక కరోనా సంక్రమణ, నిష్క్రమణలు ఎటువంటి పరిస్థితులలో జరుగుతాయనే విషయం తెలుసుకొనేందుకు ఈ ఎలిజా పరీక్షలు ఉపయోగపడతాయి. ఆ నివేదికల ఆధారంగా ఇకపై దేశంలో కరోనాను ఏవిధంగా అడ్డుకోవాలో తెలుస్తుంది కనుక తదనుగుణంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోగలుగుతాయని, వ్యాక్సిన్ అభివృద్ధికి దోహదపడుతుందని ఐసిఎంఆర్, ఎన్ఐఎన్ బృందం భావిస్తోంది. 


Related Post