ఏడాది పాలన పూర్తి చేసుకొన్న జగన్‌ ప్రభుత్వం

May 30, 2020


img

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సిఎంగా విజయవాడలో ప్రమాణస్వీకారం చేశారు. మొదటిరోజు నుంచే సంక్షేమ బాట పట్టిన జగన్‌ ప్రభుత్వం నేటికీ అదే బాటలో సాగుతోంది. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది కాలంలో ప్రభుత్వ వ్యవస్థలలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. 

దేశంలో రెండవ ధనిక రాష్ట్రమని చెప్పుకొనే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో నేటికీ తాత్సారం చేస్తుంటే, ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగోకపోయినా జగన్‌ ప్రభుత్వం నెలకు రూ.5,000 గౌరవ వేతనంతో 2.75 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది. ఎక్కడికక్కడ గ్రామ, వార్డ్ సచివాలయాలు ఏర్పాటు చేసి వాటిలో 1.34 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించింది జగన్‌ ప్రభుత్వం.  

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిఎం కేసీఆర్‌ నిర్ద్వందంగా తిరస్కరిస్తే, ఆ భారం ఏమాత్రం భరించలేని స్థితిలో ఉన్న జగన్‌ ప్రభుత్వం 50,000కు పైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకొంది!

తెలంగాణలో రైతుబంధు పధకం ద్వారా రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.10,000 చొప్పున ఇస్తుంటే, ఏపీలో రైతు భరోసా పధకం క్రింద ఎకరానికి ఏడాదికి రూ.13,500 చొప్పున ఇస్తుండటం విశేషం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు, నవరత్నాలలో భాగంగా సంక్షేమ పధకాలకు జగన్‌ ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తోంది.                  

స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గొప్ప పేరు తెచ్చిపెట్టిన ఆరోగ్యశ్రీ పధకాన్ని మరింతమందికి అందజేస్తోంది. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారందరికీ దానిని వర్తింపజేయడం నిజంగా సాహసమే. 

తెలంగాణ సిఎం కేసీఆర్‌ సహాయ సహకారాలతో అధికారం చేజిక్కించుకొన్న జగన్‌మోహన్‌రెడ్డి, ఇప్పుడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఆయనపైనే కత్తులు దూస్తున్నారు. ఇలా ఒకటేమిటి.. చెప్పుకొనేందుకు చాలా ఉన్నాయి

సంక్షేమ పధకాల కారణంగా ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల నుంచి ఎంత ఆదరాభిమానాలు పొందుతున్నారో వివాదాస్పద, అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రాన్ని అయోమయ పరిస్థితిలోకి నెట్టారని తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అదే కారణంగా జగన్‌ ప్రభుత్వం కోర్టులలో పదేపదే ఎదురుదెబ్బలు కూడా తింటోంది. 

వైసీపీ రాజకీయ శత్రువైన టిడిపిపై ప్రతీకారేచ్చతో రగిలిపోతూ భవనాల కూల్చివేతలు, గత ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేయడం, పనులను మద్యలో నిలిపివేయడం, అన్నా క్యాంటీన్లను మూసివేయించడం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడం, రాష్ట్ర ఎన్నికల కమీషనరును ఆర్డినెన్స్ ద్వారా తొలగించడం వంటి అనేకానేక వివాదాస్పద నిర్ణయాల కారణంగా జగన్‌ ప్రభుత్వం అనేక సమస్యలు, విమర్శలు ఎదుర్కొంటోంది. 

ఊహించినట్లే జగన్‌ అధికారం చేపట్టగానే అమరావతిలో పనులు నిలిపివేయించేశారు. దాని వలన అప్పటివరకూ దానిపై పెట్టిన వేలకోట్లు పెట్టుబడి, వేల ఎకరాల భూసేకరణ, వందల సంఖ్యలో నిర్మించిన భారీ భవనాలు అన్నీ పనికిరాకుండాపోయాయి. మూడు రాజధానుల ప్రతిపాదనతో ఏపీ పరిస్థితి అయోమయంగా మారింది. అప్పటికే ఇసుక సరఫరా లేక తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మూడు రాజధానుల ప్రతిపాదనతో ఇంకా నష్టపోయింది. జగన్‌ ప్రభుత్వాన్ని నమ్ముకొని విశాఖలో పెట్టుబడులు పెట్టాలో లేదో తెలియక రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేచి చూసే ధోరణి అవలంభిస్తుండటంతో ఆ రంగం ఇంకా నష్టపోతూనే ఉంది. 

సరిగ్గా ఇదే సమయంలో కరోనా మహమ్మారి...దాంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుచేయవలసి రావడంతో రాష్ట్రం అన్ని విధాలా ఇంకా తీవ్రంగా నష్టపోయింది. అధికారం చేపట్టిన ఏడాదిలోగానే కరోనా వంటి తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విభజనతోనే కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ లాక్‌డౌన్‌తో ఇంకా దెబ్బ తినడంతో తీవ్ర ఆర్ధిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. 

జగన్‌ ప్రభుత్వ పాలనపై ఏపీ ప్రజలలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకే దూసుకుపోతోంది. నిజం చెప్పాలంటే ఇంత వైవిద్యభరితమైన పరిపాలన బహుశః మరే రాష్ట్రంలో కనబడదేమో?ఈ నేపద్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలద్రొక్కుకొని అభివృద్ధిపదంవైపు అడుగులు వేస్తుందో లేక ఇంకా అయోమయస్థితిలోకి జారుకొంటుందో చూడాలి. 


Related Post