ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా కటీఫ్!

May 30, 2020


img

ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)తో తెగతెంపులు చేసుకొంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు. ఆ సంస్థకు ఏటా అమెరికా సుమారు రూ.3,000 కోట్లు నిధులు అందిస్తున్నప్పటికీ అది చైనా నియంత్రణలో పనిచేస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. అందుకే అది కరోనా విషయంలో ప్రపంచదేశాలను ముందుగా హెచ్చరించలేదని ట్రంప్‌ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్యం కారణంగా అమెరికాతో సహా యావత్ ప్రపంచదేశాలు కరోనాకు భారీ మూల్యం చెల్లిస్తున్నాయని, అయినా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను నిలదీయకపోగా దానినే వెనకేసుకు వస్తోందని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజులలో చైనాపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తాను వ్రాసిన లేఖపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించనందున ఇక దానితో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించినట్లు డోనాల్డ్ ట్రంప్‌ శుక్రవారం వైట్ హౌసులో తెలియజేశారు. ఇకపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా ఇచ్చే నిధులను మరింత సమర్ధంగా వినియోగించుకొనే ఇతర ఆరోగ్య సంస్థలకు అందజేస్తానని చెప్పారు.  

ప్రెసిడెంట్ ట్రంప్‌ చెప్పినట్లుగా...ప్రపంచ ఆరోగ్య సంస్థపై చైనా ఒత్తిడి లేదా ప్రభావం లేకుంటే కరోనా గురించి ప్రపంచదేశాలను అది ముందే హెచ్చరించి ఉండేది. కానీ చేయలేదు. చేతిలో భారీగా నిధులు, బలమైన యంత్రాంగం అన్నీ ఉన్నప్పటికీ కరోనాను కట్టడి చేయడానికి గట్టి ప్రయత్నాలు చేయలేదు. అందుకే ఆఫ్రికాలో కొన్ని పేదదేశాలలో కరోనాతో వేలాదిమంది రోజూ మరణిస్తున్నారు. పేదరికం కారణంగా వారి శవాలను పూడ్చిపెట్టలేక రోడ్లపైనే పడేస్తున్నారు. దాంతో ఆ ప్రాంతాలలో కరోనా ఇంకా వేగంగా పెరిగిపోతోంది. తమకు సంబందమే లేని ఓ సమస్యకు వారు బలైపోతుంటే, చైనా...దాని కనుసన్నలలో పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ వారిని ఆదుకోవడం లేదు. 

ఇక అమెరికాతో సహా యావత్ ప్రపంచ దేశాలు కరోనాకు చాలా భారీ మూల్యం చెల్లిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక్క అమెరికాలోనే నేటి వరకు 1,04, 452 మంది కరోనాతో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 3,66,890 మంది కరోనాకు బలయ్యారు. ఇంకా అవుతూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమీ చేయలేకపోతోంది. కనుక ట్రంప్‌ ఆగ్రహం, నిర్ణయం రెండూ సరైనవేనని చెప్పవచ్చు. 


Related Post