సినిమాల్లో విలన్...నిజజీవితంలో నిజమైన హీరో

May 29, 2020


img

అరుందతి సినిమాలో సోనూసూద్‌ని చూసినవారు అతను నిజజీవితంలో ఇంకెంత క్రూరంగా ఉంటాడో అనుకొనేలా నటించాడు. సినిమాలలో విలన్‌గా నటిస్తున్నప్పటికీ, నిజజీవితంలో మాత్రం అతను నిజమైన హీరో అనిపించుకొంటున్నాడు. 

కరోనా... లాక్‌డౌన్‌ సమయంలో ఆయన ఎంత మంచితనాన్ని అందరూ కళ్ళారా చూడగలుగుతున్నారు. ముంబైలో చిక్కుకొన్న వేలాదిమంది వలసకార్మికులను సుమారు నెలరోజులపాటు ఆదుకొన్నాడు. కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిస్తుండటంతో వారి అభ్యర్ధన మేరకు డజన్ల కొద్దీ బస్సులు ఏర్పాటు చేశాడు. దారిలో తినేందుకు వారికి అవసరమైన ఆహారం, పళ్ళు, నీళ్ళు వగైరా కూడా ఇచ్చి పంపాడు. వారు ఇళ్లకు చేరుకొన్న తరువాత వెంటనే పని దొరకదు కనుక ప్రతీ కార్మికుడి చేతిలో కొంత డబ్బు కూడా పెట్టి పంపాడు. అంతేకాదు...వారు ఇళ్లకు చేరుకొన్న తరువాత అక్కడి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తెలియదు కనుక వారి కుటుంబ సభ్యులందరికి నెలకు సరిపడే రేషన్ సరుకులు కూడా ఇచ్చి పంపాడు. ఇది ఆయనలో మంచితనానికి, మానవత్వానికి చక్కటి నిదర్శనంగా నిలుస్తోంది. 

ముంబైలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులను వారి నివాసాలకు వెళ్ళాలనుకొన్నప్పుడు స్థానికులు అభ్యంతరాలు చెపుతున్నారని తెలుసుకొన్న సోనూసూద్ ఆ వైద్యులందరికీ తన స్టార్ హోటల్లో పూర్తి ఉచితంగా వేర్వేరు గదులు కేటాయించారు.                    

తాజాగా ఒడిశాకు చెందిన 150 మహిళా వలస కార్మికులు రెండు నెలలుగా కేరళలో చిక్కుకొని నానా ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకొన్న సోనూసూద్ వెంటనే వారికోసం ప్రత్యేక ఛార్టెడ్ విమానమే ఏర్పాటు చేశాడు. ఈరోజు ఉదయం వారందరూ కొచ్చి విమానాశ్రయం నుంచి దానిలో బయలుదేరి రెండు గంటలలో భువనేశ్వర్ చేరుకొన్నారు. రెండు నెలలుగా వారు అనుభవిస్తున్న బాధలను సోనూసూద్ కేవలం రెండు గంటలలోనే మంత్రం వేసినట్లు మాయం చేసి వారి మొహాలలో చిర్నవ్వులు పూయించారు. ఛార్టెడ్ విమానానికి అయిన మొత్తం ఖర్చు అంతా సోనూసూదే భరించాడని ఎయిర్ ఏసియా సంస్థ ప్రతినిధులు చెప్పారు. 

గత రెండు నెలలో సోనూసూద్ ఈవిధంగా ఎంతో మందికి ఎన్నో రకాలు సహాయం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. వలస కార్మికులు దేశంలో ఎక్కడున్నా కష్టం వస్తే తనను సంప్రదించవచ్చునని, వారికి తక్షణం సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నానని సోనూసూద్ చెపుతున్నాడు. చెప్పడమే కాదు... ట్విట్టర్‌ ద్వారా తన సహాయం అర్ధించిన వలస కార్మికులందరినీ వారి స్వస్థలాలు చేరుకొనేందుకు పూర్తి సహాయసహకారాలు అందజేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు సుమారు 45,000 మందికి పైగా వలస కార్మికులకు సోనూసూద్ సహాయపడ్డాడు. ఆఖరి వలస కార్మికుడు కూడా తన ఇంటికి చేరుకోనేవరకు సహాయపడుతూనే ఉంటానని సోనూసూద్ చెప్పాడు. కష్టకాలంలోనే మనుషుల అసలు లక్షణాలు బయటపడతాయని పెద్దలు ఊరికే అనలేదు. సోనూసూద్ విషయంలో అది నూటికి నూరుశాతం నిజమని అంగీకరించవచ్చు. మానవత్వానికి నిలువెత్తునిదర్శనంగా నిలుస్తున్న ఈ కండలవీరుడికి హ్యాట్స్ ఆఫ్! 


Related Post