త్వరలో రైతులకు శుభవార్త వినిపిస్తాం: కేసీఆర్‌

May 29, 2020


img

ఈరోజు కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు విడుదల చేసిన తరువాత సిఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో లక్షల ఏకరాలకు సాగునీరు అందించగలుగుతున్నాము. మన ఇంజనీర్లు, సాగునీటి రంగం నిపుణులు అందరూ కలిసి కేవలం మూడేళ్లలో ఈ అద్భుతం సాధించారు. తత్ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి అదనంగా  165 టీఎంసీలు నీళ్ళు అందుబాటులోకి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లను నడిపించేందుకు 4,800 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తున్నాము. అయితే ఆ భారం రైతులపై మోపకుండా వారికి ఉచితంగా నీళ్ళు అందిస్తున్నాము. 

రైతుల మేలు కోసం మన ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తోంది. ఇటువంటి గొప్ప పధకాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. అతి త్వరలోనే రైతులకు గొప్ప శుభవార్త వినిపిస్తాను. అది విని యావత్ దేశం ఆశ్చర్యపోతుంది. దానిపై ఆర్ధికశాఖ లెక్కలు కడుతోంది. ఆ కార్యక్రమం వారం రోజులలో పూర్తవుతుందని ఆశిస్తున్నాను. అది పూర్తవగానే ఆ శుభవార్త స్వయంగా నేనే రైతులకు వినిపిస్తాను. అంతవరకు దానిపై కొంత సస్పెన్స్ కొనసాగిద్దాము,” అని అన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంకా ఎక్కడెక్కడ సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయో, అవి పూర్తయితే రైతులకు ఏ మేరకు ప్రయోజనం లభిస్తుందో సిఎం కేసీఆర్‌ వివరించారు. ఈ ఏడాది కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 83 లక్షల టన్నుల బియ్యం సేకరించగా, ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 53 లక్షల టన్నులు పంపించగలిగామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. నియంత్రిత సాగు విధానం ద్వారా సుమారు లక్ష కోట్లు రూపాయల విలువ చేసే పంటలను తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించబోతున్నారని సిఎం కేసీఆర్‌ జోస్యం చెప్పారు.

సరిగ్గా ఆరేళ్ళ క్రితం వరకు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ఎద్దడితో, విద్యుత్ కోతలతో అష్టకష్టాలు పడిందని కానీ ఇప్పుడు సస్యశ్యామల తెలంగాణగా... హరిత తెలంగాణగా... దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణగా నిలుస్తోందని సిఎం కేసీఆర్‌ అన్నారు. ఇక ముందు కూడా అందరూ ఇదేస్పూర్తి, పట్టుదలతో కలిసికట్టుగా ముందుకు సాగుతూ యావత్ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలుపుదామని సిఎం కేసీఆర్‌ అన్నారు.


Related Post