అందుకే చైనా ఇంత హడావుడి చేస్తోందా?

May 29, 2020


img

చైనా నుంచి వ్యాపించిన కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచదేశాలు ఏవిధంగా సతమతమవుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. కరోనా పుట్టుక వ్యాప్తి విషయంలో చైనా పాత్రను కనుగొనేందుకు విచారణ జరపాలని 62 దేశాలు తీర్మానం చేశాయి. దీనికి చైనాయే బాధ్యత వహించాలని అమెరికా తదితర దేశాలు వాదిస్తున్నాయి. చైనా ఈ ఆరోపణలను కొట్టిపడేసినప్పటికీ, అన్ని దేశాలు ఏకమై తననే వేలెత్తి చూపుతుండటంతో రానున్న రోజులలో భారీ మూల్యం చెల్లించక తప్పదని చైనా పాలకులు గ్రహించే ఉంటారు. కనుక వేరే అంశంపైకి ప్రపంచదేశాల దృష్టి మళ్ళించడం ద్వారా తాత్కాలికంగానైనా ఈ సమస్యపై నుంచి బయటపడాలని చైనా ప్రయత్నిస్తున్నట్లుంది. అందుకే హటాత్తుగా నేపాల్‌ను రెచ్చగొట్టి భారత్‌పైకి ఉసిగొల్పడం, భారత్‌-చైనా సరిహద్దుల వద్ద యుద్ధవాతావరణం సృష్టించడం, అటు హాంగ్‌కాంగ్‌ను తన అధీనంలోకి తెచ్చుకోవడానికి హడావుడి చేయడం వంటివన్నీ చేస్తున్నట్లుంది. 

చైనా పాలకులు ఊహించినట్లే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కరోనా గొడవలను పక్కన పెట్టి భారత్‌-చైనాల మద్య మద్యవర్తిత్వం చేస్తానంటూ బయలుదేరారు. భారత్‌-చైనాల యుద్ధం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా ఆశిస్తున్నది కూడా అదే కనుక భారత్‌తో కయ్యానికే సిద్దపడవచ్చు. భారత్‌ను రెచ్చగొట్టి ఏదోవిధంగా యుద్ధం మొదలుపెట్టి ఒకటి రెండు నెలలు నామమాత్రంగానైనా దానిని కొనసాగించగలిగితే, ఇక ప్రపంచదేశాలన్నీ కరోనాను పక్కనపెట్టి ఆ యుద్ధం గురించే ఆలోచిస్తూ...మాట్లాడటం మొదలుపెడతాయి. 

ఒకవేళ ఈ యుద్ధంలో అమెరికా భారత్‌కు అండగా నిలిస్తే, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఉత్తరకొరియా, టర్కీ, కొన్ని గల్ఫ్ దేశాలు చైనాకు అండగా నిలబడటం ఖాయం. దాంతో ప్రపంచదేశాలు రెండుగా విడిపోతాయి. దాంతోబాటే కరోనా విషయంలో చైనా పాత్రపై అభిప్రాయాలు కూడా మారిపోతాయని వేరే చెప్పక్కరలేదు. కనుక చైనా ప్రదర్శిస్తున్న ఈ యుద్ధోన్మాదం యాదృచ్ఛికంగా భావించలేము. 


పైగా చైనాకు మొదటి నుంచి రాజ్యవిస్తరణ కాంక్ష కూడా చాలా బలంగా ఉంది. నిత్యం ఏదో దేశంతో కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంటుంది. కనుక ఒకవేళ భారత్‌తో యుద్ధం మొదలైతే ఇదే అదునుగా ఈసారి అరుణాచల్ ప్రదేశ్‌తో సహా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను, అలాగే పాకిస్థాన్‌ కోసం భారత్‌ అధీనంలో ఉన్న కశ్మీర్‌ను స్వాధీనం చేసుకొనేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు. అంతేకాదు...కరోనా మహమ్మారి ధాటికి డ్డీలాపడిపోయి బలహీనంగా మారుతున్న అమెరికాను ఇదే అదునుగా మరోసారి చావుదెబ్బ తీయగలిగితే ప్రపంచదేశాలలో అగ్రరాజ్య స్థానాన్ని చైనా దక్కించుకోవచ్చు. 

అయితే ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేము కానీ కరోనా విషయంలో దోషిగా నిలబడకుండా తప్పించుకోవడానికి చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇలాగే కొనసాగితే అప్పుడు చివరికి ఇవే జరుగవచ్చు.

కరోనాతో భారత్‌ను దారుణంగా దెబ్బతీసి, కోట్లాదిమంది పేదలను రోడ్డున పడేసిందేగాక ఇప్పుడు భారత్‌తో యుద్ధానికి కాలుదువుతున్న చైనా పట్ల...దాని ఉత్పత్తుల పట్ల భారతీయుల వైఖరి కూడా మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. తమకు అపారమైన దేశభక్తి ఉందనుకొంటున్న 137కోట్లమంది భారతీయులు ఇప్పుడు చైనా ఉత్పత్తులు కొనడం మానుకొంటే చాలు...చైనా దూకుడుకు కళ్ళెం వేయవచ్చు. స్వదేశీ పరిశ్రమలకు, ఉత్పత్తులకు చేయూతనందించినవారవుతారు కూడా. 


Related Post