తెలంగాణలో కొత్తగా 117 కేసులు... మొత్తం 2,256

May 29, 2020


img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి మళ్ళీ మెల్లగా పెరుగుతోంది. గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో నివశిస్తున్న 66 మందికి, ఇద్దరు వలస కార్మికులకు, సౌదీ నుంచి తిరిగి వచ్చిన 49 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. నిన్న కొత్తగా బయటపడిన 66 పాజిటివ్ కేసులలో 58 జీహెచ్‌ఎంసీ పరిధిలోవే కాగా, రంగారెడ్డి జిల్లాలో 5, మేడ్చల్-2, సిద్ధిపేటలో ఒకటి ఉన్నాయి.    

తెలంగాణలో నివశిస్తున్నవారికి సంబందించి మొత్తం 1,908 కేసులు నమోదు కాగా మిగిలిన 348 కేసులు కూడా కలిపి చూసినట్లయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,256కి చేరింది. ఇప్పటి వరకు 1,345 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా మరో 844 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 67 మంది కరోనాతో మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలియజేసింది.

రాష్ట్రంలో వరంగల్‌ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఆ మూడు జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్‌, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ అర్బన్, గద్వాల్, జనగావ్, నిర్మల్ జిల్లాలలో గత 14 రోజులలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో తెలియజేసింది.

వలస కార్మికులు, విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిలో కరోనా సోకినవారి లెక్కలు వేరేగా చూపుతున్నందున, వారు ఏ జిల్లాకు చెందినవారైనప్పటికీ ఆ జిల్లాలో నమోదైన కేసుగా చూపడం లేదు. ఉదాహరణకు సిద్ధిపేటకు చెందిన వలస కార్మికుడికి కరోనా సోకినట్లయితే, దానిని సిద్ధిపేట లెక్కలో కాకుండా వలస కార్మికుల కేసులలో చూపుతున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇదేవిదంగా చూపుతున్నాయి.


Related Post