ఈనెల కూడా జీతాలలో కోతలు

May 28, 2020


img

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన నిన్న ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దానిలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. 

లాక్‌డౌన్‌ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం బారీగా ఆదాయం కోల్పోవడంతో ప్రభుత్వోద్యోగులకు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు, పెన్షన్లలో కోత విధిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీన చెల్లించవలసిన మే నెల జీతాలు, పెన్షన్లలో కూడా కోతలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం జీతాలలో కోతలపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు క్లుప్తంగా... 

1. లాక్‌డౌన్‌ కారణంగా అన్నీ మూతపడటంతో పన్నుల రూపేణా ప్రభుత్వానికి రావలసిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. 

2. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళే ఆదాయం కూడా ఆ మేరకు తగ్గిపోవడంతో, రాష్ట్ర వాటాగా కేంద్రం నుంచి రావలసిన మొత్తం కూడా ఆ మేరకు తగ్గిపోయింది.      

3. మే నెలలో రాష్ట్ర వాటాగా కేంద్రం నుంచి రూ.3,100 కోట్లు మాత్రమే వచ్చాయి. 

4. లాక్‌డౌన్‌ సడలించినప్పటికీ ఇంకా అన్నీ ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించనందున రాష్ట్ర ఆదాయం పెరుగలేదు. 

5. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోనందున అప్పులను రీ షెడ్యూల్ చేయాలని చేసిన విజ్ఞప్తిని కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు.        

6. కనుక ఈ ఏడాదిలో రూ.37, 400 కోట్లు చెల్లించక తప్పదు. రాష్ట్ర ఆదాయం పెరగనప్పటికీ నెలసరి వాయిదాగా ప్రతీ నెల రూ.3,116.66 కోట్లు తిరిగి చెల్లించక తప్పడం లేదు.

7. జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లించాలంటే రూ.3,000 కోట్లు పైగా అవసరం. 

8. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో ఉన్న సొమ్ములో నుంచి పూర్తి చెల్లింపులు చేసినట్లయితే ఖజానా ఖాళీ అయిపోతుంది.  

9. కనుక ఈ నెల కూడా ప్రజాప్రతినిధుల వేతనాలలో 75 శాతం,  ఐఏఎస్ అధికారులకు 60 శాతం, ప్రభుత్వోద్యోగులకు 50 శాతం, పెన్షనర్లకు 25 శాతం చొప్పున మే నెలలో కూడా కోతలు కొనసాగించబడతాయి. 

10. కాంట్రాక్టు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతలలో 10 శాతం కోత కొనసాగుతుంది.

11.  లాక్‌డౌన్‌ సడలించినందున మళ్ళీ అందరికీ పని ఆదాయం లభిస్తుంది కనుక వారికి నెలనెలా ఇస్తున్న రూ.1,500 మే నెల నుంచి నిలిపివేయబడుతుంది. 

12. అయితే పేదలందరికీ ఒక్కొక్కరికీ 12కిలోల చొప్పున బియ్యం అందించబడుతుంది. 


Related Post