ఈసారి లాక్‌డౌన్‌ ఆ 11 నగరాలకే?

May 28, 2020


img

ఈ నెలాఖరుతో లాక్‌డౌన్‌ ముగుస్తుంది. కనుక మళ్ళీ కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగిస్తుందా లేదా?అనే విషయంపై నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం మరో 15 రోజులు లాక్‌డౌన్‌ పొడిగించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న 11 నగరాలలోనే పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ, మిగిలిన ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఇంకా సడలించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. డిల్లీ, బెంగళూరు (కర్ణాటక), ముంబై, థానే, పూణే (మహారాష్ట్ర) అహ్మదాబాద్, సూరత్ (గుజరాత్‌), జైపూర్ (రాజస్థాన్‌), ఇండోర్ (మధ్యప్రదేశ్‌) చెన్నై (తమిళనాడు), కోల్‌కతా (పశ్చిమబెంగాల్) నగరాలలో లాక్‌డౌన్‌ యధాతధంగా కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. 

భౌతికదూరం, కరోనా జాగ్రత్తలు పాటించాలనే నిబందనలతో దేవాలయాలు, మసీదులు, ఇతర ప్రార్ధనా మందిరాలను తెరిచేందుకు అనుమతించవచ్చని సమాచారం. పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, స్విమ్మింగ్ ఫూల్స్ వగైరాలపై యధాప్రకారం మరో 15 రోజులు నిషేధం కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈసారి మరిన్ని రైళ్లు,కరోనా ప్రభావం తక్కువగా ఉన్న నగరాలలో మెట్రో రైళ్ళను అనుమతించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ ఆంక్షల అమలు విషయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్చనివ్వాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడితే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది. 

దేశ ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభాల వంటి ఆ 11 నగరాలలో లాక్‌డౌన్‌ కొనసాగించినట్లయితే కోలుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు. కానీ ఆ నగ్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు ఇంతకంటే వేరే గత్యంతరం కూడా లేదు. 


Related Post