మిడతలదండు వచ్చేస్తోంది...రైతన్నలు తస్మాత్ జాగ్రత్త!

May 27, 2020


img

ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు చేరుకొన్న మిడతలదండు అక్కడి పంటలను తినేసిన తరువాత రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా ఇప్పుడు మహారాష్ట్రకు చేరుకొన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలోని అమరావతి వరకు మిడతలదండు వచ్చేసింది. 

కరోనా మహమ్మారితో అలుపెరుగని పోరాటం చేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి...అక్కడి ప్రజలకు ఇదో కొత్త కష్టమే. మహారాష్ట్ర వ్యవసాయశాఖ సిబ్బంది వాటిని తరిమి కొట్టేందుకు చేపట్టిన చర్యలు ఏవీ పెద్దగా ఫలించకపోవడంతో, రైతులే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒకేసారి కోట్ల సంఖ్యలో వచ్చి పడుతున్న మిడతలను పారద్రోలడం వారి వల్ల కూడా సాధ్యం కావడం లేదు. దాంతో చేతికి అందివచ్చిన పంటలను మిడతలు తినేస్తుంటే ఏమీ చేయలేక రైతులు కన్నీళ్ళు పెట్టుకొంటున్నారు. 

ఆ మిడతలదండు త్వరలోనే మహారాష్ట్ర నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోకి ప్రవేశించే అవకాశం ఉంది కనుక తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్ధన్ రెడ్డి మంగళవారం రాత్రి వ్యవసాయశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, ఒకవేళ మిడతలదండు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశంపై  చర్చించారు. ముఖ్యంగా మహారాష్ట్రకు సరిహద్దు జిల్లాలుగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్‌, కామారెడ్డి, భూపాలపల్లిలోకి ఈ మిడతలదండు ప్రవేశించే అవకాశం ఉంది కనుక ఆ జిల్లా కలక్టర్లను, జిల్లాల వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేసి, మిడతలదండును ఎదుర్కోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 

ఈ మిడతలదండు గంటకు 12 నుంచి 15 కిమీ వేగంతో రోజుకు సుమారు 135-150 కిమీ దూరం ప్రయాణించగలవు. వాటికి పంట ఏదైనా పరువాలేదు. పచ్చగా కనబడితే చాలు...మీద పడి క్షణాలలో వేల ఎకరాలలో పంటలను తినేస్తుంటాయి. ఒక్కో మిడత తన శరీర బరువుకు సమానమైన ఆహారం తింటుంది. మిడత జీవితకాలం 3 నెలలే అయినప్పటికీ అంతా తక్కువ సమయంలోనే అవి 20 రెట్లు సంతానోత్పత్తి చేయగలవు. దాంతో వాటి సంఖ్య రోజురోజుకూ కోట్ల సంఖ్యలో పెరిగిపోతోంది. 

ఒక చదరపు కిలోమీటరు పరిధిలో సుమారు 8 కోట్ల మిడతలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం మన దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు 1,500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందంటే ఎన్ని కోట్ల మిడతలు ఉన్నాయో, అవి ఎంత నష్టం కలిగిస్తాయో ఊహించలేము కూడా. 2,500 మంది మనుషులకు ఒక రోజుకు సరిపడే ఆహారాన్ని ఒక చిన్న మిడతల దండు తినేస్తుంది. కనుక ఏపీ, తెలంగాణ రైతన్నలు...తస్మాత్ జాగ్రత్త!

మిడతలదండును ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న కొన్ని పద్దతులు: 

1. ఖాళీ డబ్బాలు, పళ్ళేల వాయిస్తూ లేదా స్పీకర్లు పెట్టి పెద్ద శబ్ధాలు చేస్తే మిడతలను చెరగొట్టవచ్చు.  

2. ప్రతీ 15 లీటర్లకు 45 మిలీ లీటర్ల వేపనూనె కలిపి పంటలపై పిచ్చికారీ చేస్తే మిడతలు పంటను తినకుండా కాపాడుకోవచ్చు. 

3. క్వినాల్ ఫాస్ మందును 1.5 శాతం చొప్పున డీపీఈ లేదా మిథైల్ పారథియాన్‌ 2 శాతం కలిపి డీపీ పొడిని హెక్టారుకు 25 కిలోల చొప్పున పంటలపై చల్లినా మిడతల నుంచి పంటను కాపాడుకోవచ్చు.



Related Post