అది కొరివితో తల గోక్కొవడమే కదా?

May 26, 2020


img

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అల్-ఖైదా ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చిన నేరానికి హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం జూబైర్ మహమ్మద్ (40) అనే వ్యక్తి అమెరికాలో 5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. అతని శిక్షాకాలం పూర్తవడంతో అమెరికా అధికారులు అతనిని భారత్‌కు అప్పగించారు. ఈనెల 19వ తేదీన అతనిని ప్రత్యేక విమానంలో పంజాబ్‌కు తీసుకువచ్చారు. 

భారత్‌లో కూడా అతను గతంలో ఏవైనా నేరాలకు పాల్పడ్డాడా? ఉగ్రవాదులతో సంబందాలు కలిగి ఉన్నాడా? అనే విషయాలు రాబట్టేందుకు అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరొకటి రెండు రోజులలో అతనిని హైదరాబాద్‌ తీసుకువచ్చి ఇక్కడి పోలీస్ అధికారులకు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం జూబైర్ మహమ్మద్‌ ఉన్నత చదువుల కోసం 2001లో అమెరికాలో వెళ్ళాడు. 2006లో అక్కడే ఓ అమెరికన్ యువతిని వివాహం చేసుకొని గ్రీన్‌ కార్డ్ సంపాదించుకొని ఒహియో రాష్ట్రంలోని టొలేడోలో స్థిరపడ్డాడు. ఆ తరువాత ఉగ్రవాద కార్యక్రమాల వైపు ఆకర్షితుడై అల్-ఖైదా ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూరుస్తుండేవాడు. అమెరికా నిఘా వర్గాలు అది పసికట్టి అతనిని అరెస్ట్ చేసి 2015లో జైలుకు పంపాయి. ఇప్పుడు అతనిని హైదరాబాద్‌ నగరానికి తీసుకువస్తున్నారు. 

హైదరాబాద్‌లో అతనిపై ఎటువంటి కేసులు నమోదు కాలేదు కనుక అతనిని స్వేచ్ఛగా విడిచిపెడతారా? లేదా ఏదో ఓ సాకు చూపి నిర్బందంలో ఉంచుతారా? లేక అతనిని కేంద్రప్రభుత్వానికే అప్పగించేస్తారా? అనే విషయం త్వరలో తేలిపోతుంది. కానీ అటువంటి ప్రమాదకరమైన వ్యక్తిని హైదరాబాద్‌కు తెచ్చి పెట్టుకోవడం కొరివితో తలగోక్కొవడం వంటిదే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకొంటుందో? చూడాలి.


Related Post