కేంద్రం లాక్‌డౌన్‌ మళ్ళీ పొడిగిస్తుందా?

May 26, 2020


img

కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది కనుక మళ్ళీ లాక్‌డౌన్‌ పొడిగిస్తుందా లేదా అనేది మరో రెండు మూడు రోజులలో తెలుస్తుంది. లాక్‌డౌన్‌ సడలింపుల వలన దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవడం కూడా చాలా అవసరం కనుక ఈసారి కూడా మరికొన్ని రంగాలకు సడలింపులు ప్రకటించి లాక్‌డౌన్‌ కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పటికే రైళ్ళు, బస్సులు, విమానాలను అనుమతించినందున ఈ నెలాఖరులోగా దేశంలో కరోనా పరిస్థితులను సమీక్షించి, అదుపులోనే ఉన్నాయని భావించినట్లయితే ఈసారి కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాలలో మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్లను అనుమతించవచ్చు. 

ఉదాహరణకు మహారాష్ట్రలో...ముఖ్యంగా ముంబైలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున అక్కడ లోకల్, మెట్రో రైళ్ళపై నిషేదం కొనసాగిస్తూనే, హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా తదితర నగరాలలో అనుమతించవచ్చు. జూన్ రెండవవారం నుంచి రైళ్ళ సంఖ్యను ఇంకా పెంచవచ్చు. రైళ్ళు, విమానాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటుంది కనుక ప్రస్తుతం అమలులో ఉన్న క్వారెంటైన్‌ నిబందనలలో కొన్ని మార్పులు చేర్పులు చేయక తప్పదు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాలలో హోటల్స్,  సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్ కు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నడిపించుకొనేందుకు అనుమతించవచ్చు. 

అయితే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఎటువంటి నియమనిబందనలు విధిస్తున్నాయనే దానికంటే ప్రజలు వాటిని ఎంత నిఖచ్చిగా పాటిస్తున్నారనేదే చాలా ముఖ్యం. కనుక ప్రజలు కూడా బాధ్యతగా మెలిగినప్పుడే కరోనా మహమ్మారికి అడ్డుకట్టవేయడం సాధ్యం అవుతుంది.   

సిఎం కేసీఆర్‌ రేపు ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల ప్రభావం, ప్రస్తుత కరోనా పరిస్థితులు, రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింపు, తదితర అంశాలపై చర్చించనున్నారు.


Related Post