కరోనా చికిత్స కంటే నివారణే సులువు కదా?

May 25, 2020


img

దేశంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నంతకాలం అదుపులో ఉన్న కరోనా వైరస్‌, ఆంక్షలు సడలించడంతో మళ్ళీ వేగం పుంజుకొంటోంది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 6,977 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు రోజుకు కనీసం 6,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. 130 కోట్లు జనాభా ఉన్న భారత్‌లో ఇది చాలా తక్కువే అయినప్పటికీ, ఇదే వేగంతో దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లయితే, నెలకు లక్షా ఎనబైవేల కేసులు చొప్పున పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. అప్పుడు ఇక కరోనాను ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. దేశంలో ఇదేవిధంగా కరోనా వ్యాపిస్తుంటే, ప్రజలు మునుపటిలా నిర్భీతిగా బయటకు వచ్చి పనులు చేసుకోవడానికి భయపడతారు కనుక అన్ని రంగాలు పూర్తిస్థాయిలో పనిచేయడం కూడా కష్టమవుతుంది. 

అయితే కరోనాకు వ్యాక్సిన్ కనుగొని అది సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చేవరకు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులలోనే అందరూ పనులు చేసుకోవలసి ఉంటుందని స్పష్టమైంది. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలే చొరవ తీసుకొని, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహాయసహకారాలతో ఎక్కడికక్కడ శానిటైజ్ (శుభ్రం) చేస్తుండటం, సామాన్య ప్రజలకు ఉచితంగా శానిటైజర్, మాస్కూలు, గ్లౌజులు వంటివి పంపిణీ చేస్తుండటం చాలా అవసరం. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయితే మరికొంతకాలం పాటు దీనిని భారీ ఎత్తున నిరంతరంగా పంపిణీ చేయవలసి ఉంటుంది.

 లేకుంటే వాటిని కొనుగోలు చేయలేని ప్రజలు అవి లేకుండానే బయట తిరిగితే వారికి లేదా వారి ద్వారా ఇతరులకు కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అప్పుడే ప్రజలలో కూడా కరోనా నుంచి తమకు ఎంతో కొంత రక్షణ పొందుతున్నామనే భావన, నమ్మకం కలుగుతుంది. దాంతో ధైర్యంగా బయటకు వచ్చి తమ విధులు, వ్యాపారాలు చేసుకోగలుగుతారు. కరోనా సోకిన తరువాత ప్రజలకు చికిత్సకు అయ్యే ఖర్చు భరించడం కంటే, కరోనా సోకకుండా ప్రజలకు ఉచితంగా మాస్కూలు, గ్లౌజులు వంటివి పంపిణీ చేస్తే తక్కువ ఖర్చుతో ఈ సమస్యను అధిగమించవచ్చు. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు చికిత్సకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో, మస్కూలు, శానిటైజర్ల పంపిణీకి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగలిగితే మంచిది.


Related Post