పొరుగు రాష్ట్రాలలో కరోనాతో తెలుగు రాష్ట్రాలకు ఇబ్బంది

May 25, 2020


img

పొరుగు రాష్ట్రం ఏపీలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో కరోనా పరీక్షలు చాలా ఎక్కువగా చేస్తుండటం అందుకు కారణం అయ్యుండవచ్చు. గడిచిన 24 గంటలలో 10,240 మందికి పరీక్షలు చేయగా 44 మందికి పాజిటివ్ అని తేలింది. దాంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,621కి చేరింది. ఈరోజు ఉదయం 41 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1,848 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయని చెప్పవచ్చు. ఒకవేళ కొత్త కేసులు లేకపోయుంటే, నేడు ఆసుపత్రులలో ఒక్క పేషంట్‌ కూడా ఉండేవారు కాదు. ప్రస్తుతం ఏపీలో 767 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 56 మంది కరోనాతో మృతి చెందారు. 

రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా పూర్తి నియంత్రణలో ఉన్నప్పటికీ పొరుగునే ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో కరోనా కేసులు చాలా భారీగా పెరిగిపోతుండటం చాలా ఆందోళనకరంగా మారిందని చెప్పక తప్పదు. మహారాష్ట్రలో 50,231, తమిళనాడులో 16, 277 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 30,452, చెన్నైలో 10,582 కేసులు నమోదయ్యాయి. దేశరాజధాని డిల్లీలో 13,418 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ మూడు ప్రాంతాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలకు రాకపోకలు మొదలయ్యాయి కనుక అన్నీ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ ఇది ఇప్పట్లో తీరే సమస్య కాదు కనుక కరోనాను ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్రాలలో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం కనిపిస్తోంది. లేకుంటే ప్రభుత్వాలు నిరంతరం కరోనాతో పోరాటం చేస్తుండిపోతే మిగిలిన ప్రభుత్వ వ్యవస్థలు, రంగాలు క్రమంగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంటుంది.


Related Post