మహారాష్ట్రలో 1,666 మంది పోలీసులకు కరోనా!

May 23, 2020


img

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 2,940 కొత్త కేసులు నమోదయ్యాయి. సుమారు రెండు నెలల తరువాత కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇన్ని కరోనా కేసులు నమోదు కాలేదు. 

మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజునే మహారాష్ట్రలో 63 మంది కరోనాతో చనిపోయారు. ఇంకా విషాదకరమైన విషయమేమిటంటే, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కరోనా ఆసుపత్రుల వద్ద, క్వారెంటైన్‌ కేంద్రాల వద్ద, రోడ్లపైన విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కూడా కరోనా బారిన పడుతున్నారు. నిన్న ఒకే రోజున వారిలో 278 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,666 మంది పోలీసులకు కరోనా సోకగా వారిలో 18 మంది చనిపోయారు. 

దాంతో మహారాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్ళు వయసున్న పోలీసులందరికీ విధుల నుంచి మినహాయింపు నిచ్చింది. ఒకేసారి 1,666 మంది ఆసుపత్రుల పాలవడం, అనేక వేలమంది విధులకు మినహాయింపు పొందడంతో పోలీసుల కొరత ఏర్పడింది. దాంతో కేంద్రబలగాల నుంచి అత్యవసరంగా 2,000 మందిని పంపించవలసిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వాన్ని కోరింది. ఇది మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని చెప్పవచ్చు. 

మహారాష్ట్రలో అత్యధికంగా రాజధాని ముంబైలోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో 27,251 కేసులు నమోదుకాగా వారిలో 909 మంది చనిపోయారు. ముంబై మహానగరానికి సమీపంలో ఉన్న థానే జిల్లాలో 5,717, పారిశ్రామిక, ఐ‌టి రంగాలకు నిలయమైన పూణేలో 4,993 కేసులు, షిరిడీకి సమీపంలోగా అవురంగాబాద్ జిల్లాలో 1,187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 44,582 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,517 మంది చనిపోయారు. 

కొన్ని రోజుల క్రితం యావత్ భారతదేశంలో ఇన్ని కేసులుండేవి కానీ ఇప్పుడు ఒక్క మహారాష్ట్రలోనే 50,000కి దగ్గరలో కేసులు నమోదయ్యాయి. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉండటంతో దేశ ఆర్ధిక రాజధానిగా చెప్పుకోబడే ముంబై గత రెండు నెలలుగా స్తంభించిపోయింది. అయినప్పటికీ కరోనా కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రపై ముఖ్యంగా ముంబైపై...కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కానీ దానిని కట్టడి చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఈ గణాంకాలే చెపుతున్నాయి. మహారాష్ట్రలో కరోనాను కట్టడి చేయలేకపోతే, ముందుగా ఆ ప్రభావం ఇరుగుపొరుగు రాష్ట్రాలపై ఆ తరువాత యావత్ దేశంపై పడటం ఖాయం.         Related Post