అమెరికాలో తీవ్రమైన నిరుద్యోగ సమస్య!

May 23, 2020


img

అమెరికా అంటే ఓ స్వర్గం...ఆ స్వర్గంలో ఓసారి కాలుపెడితే చాలు...జన్మ ధన్యమైపోతుంది అనుకొనేవారు కోకొల్లలు. ఇక ఉన్నత చదువులు, లక్షల రూపాయల జీతాలతో కూడిన ఉద్యోగాలు కావాలంటే అమెరికా వెళ్ళక తప్పదనుకొనేవారు కోకొల్లలు. 

ఇప్పటికే లక్షలాది భారతీయులు అమెరికాలో స్థిరపడ్డారు...ఇంకా అనేక లక్షల మంది అక్కడకు వెళ్ళి స్థిరపడాలనుకొంటున్నారు. ఒక్క భారత్‌ మాత్రమే కాదు...అనేక దేశాల పౌరులు అమెరికాలో ఉద్యోగాల కోసం వెళుతుంటారని అందరికీ తెలుసు. ఏటా ఎన్ని లక్షలమంది విదేశీయులు వస్తున్నా అందరికీ ఏదో ఓ పని కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపుతుంటుంది అమెరికా. అటువంటి అమెరికాలోనే ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. 

లాక్‌డౌన్‌తో అనేక కంపెనీలు మూతపడటంతో లక్షలాదిమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. తాజా సమాచారం ప్రకారం సుమారు 4 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికా చట్టాల ప్రకారం వారికి ప్రభుత్వం నిరుద్యోగభృతి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు సుమారు మూడున్నర కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఇంకా దరఖాస్తులు అందుతూనే ఉన్నాయని కార్మికశాఖ తెలిపింది. అయితే అన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుండటంతో గత కొన్ని రోజులుగా నిరుద్యోగ భృతి దరఖాస్తుల జోరు కాస్త తగ్గుముఖం పట్టిందని తెలిపింది. 

అమెరికన్లే ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారుతున్నప్పుడు విదేశీయులకు అమెరికా ఉద్యోగాలు కల్పించగలదనుకోలేము. పైగా ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ట్రంప్‌ మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలంటే తప్పనిసరిగా అమెరికన్లకు భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. కనుక విదేశీయులను పక్కన పెట్టి అమెరికన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఈయవలసి ఉంటుంది. ఈ నేపధ్యంలో అమెరికాలో మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకు అంటే...సుమారు మరొక ఏడాదిపాటు భారతీయులు అమెరికా ఉద్యోగాలపై ఆశ పెట్టుకోకపోవడమే మంచిది. 


Related Post