కరోనా పరీక్షలపై కేంద్రం-తెలంగాణ ప్రభుత్వం డ్డీ

May 23, 2020


img

తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మద్య చిన్నగా యుద్ధం మొదలైంది. రాష్ట్రంలో నామమాత్రంగా కరోనా పరీక్షలు నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌కు ఇటీవల లేఖ వ్రాశారు. దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తుంటే తెలంగాణలో కేవలం 21,000 పరీక్షలు మాత్రమే నిర్వహించడాన్ని తప్పు పట్టారు. కరోనా వైరస్‌ పట్ల అలసత్వంతో ఉంటే భవిష్యత్‌లో తీవ్ర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని లేఖలో హెచ్చరించారు. కనుక కరోనా వైరస్‌ను గుర్తించి కట్టడి చేయడానికి ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలని సూచించారు. 

దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా స్పందించారు. “దారినపోయే దానయ్యలందరికీ పరీక్షలు చేయలేము. రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇంతకీ మీరు (కేంద్రం) ఏమి కోరుకొంటోంది? తెలంగాణలో కరోనా కట్టడి కావాలను కొంటున్నారా లేక వేలసంఖ్యలో కరోనా కేసులు రావాలని, వందల సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాలని కోరుకొంటున్నారా? ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, తప్పు పట్టడానికి ఏముంది?,” అని ప్రశ్నించారు. 

కరోనా వస్తే ఎంతో కాలం దాచిపెట్టడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. కనుక ఒకవేళ ఏ కారణంతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కరోనాను దాచిపెట్టాలనుకొంటే అది కొంత కాలమే సాధ్యమవుతుంది తప్ప ఎల్లకాలం సాధ్యం కాదు. ప్రస్తుతం ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో తప్పితే రాష్ట్రంలో మరెక్కడా కరోనా కేసులు నమోదు కావడం లేదు. అంటే కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగానే వ్యవహరిస్తోందని స్పష్టం అవుతోంది. ఇటీవల కేంద్ర నిపుణుల బృందం ఒకటి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. అయినా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి ఈవిధంగా లేఖ వ్రాయడం దేనికో?ఆయనే చెప్పాలి. 


Related Post