నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

May 23, 2020


img

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు మళ్ళీ వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల కోటాలో మార్చి 26న జరుగవలసిన ఎమ్మెల్సీ ఎన్నికలు లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ మరో 45 రోజులు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ శుక్రవారం ప్రకటించింది. జిల్లాలో కరోనా పరిస్థితులపై చర్చించిన తరువాత, ఉప ఎన్నికలను ఇప్పుడు నిర్వహించడం మంచిదికాదని భావించి వాయిదా వేసినట్లు తెలియజేసింది. నిజామాబాద్‌ నుంచి టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఉపఎన్నికలలో తమ అభ్యర్ధి కవితను గెలిపించుకొనేందుకు టిఆర్ఎస్‌ అక్రమాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్ ఆలీ, వి.సుబాష్ రెడ్డి తదితరులు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఉప ఎన్నికలలో గెలిచేందుకు టిఆర్ఎస్‌ నేతలు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఫిర్యాదు చేశారు. కనుక టిఆర్ఎస్‌ అభ్యర్ధి కవిత, ఆ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. 

ఉపఎన్నికలు ఎప్పుడు జరిగినా టిఆర్ఎస్‌కు పూర్తి బలం ఉన్నందున అవలీలగా విజయం సాధించడం ఖాయం. ఇది కాంగ్రెస్‌, బిజెపిలకు తెలుసు. బహుశః అందుకే రెండు పార్టీలు ఉపఎన్నికల వాయిదా కోరుకోవడం సహజమే. అయితే కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయడం అసంబద్దంగా కనిపిస్తోంది. ఎందుకంటే, నిజామాబాద్‌ జిల్లాలో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రజారోగ్య శాఖ రోజూ ప్రకటిస్తూనే ఉంది. పైగా హైదరాబాద్‌లో కొన్ని కంటెయిన్మెంట్ జోన్లు మినహా నిజామాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలు గ్రీన్‌ జోన్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కనుక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను వాయిదా వేయమని కోరితే తప్ప కరోనా సాకుతో వాయిదా వేయడం సమంజసంగా లేదని అర్ధమవుతోంది. 


Related Post