నలుగురు కాదు తొమ్మిది మంది మృతి

May 22, 2020


img

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలో గొర్రెకుంట వద్ద గల ఓ పారిశ్రామికవాడలో గోనె సంచులు కుట్టుకొని జీవిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సమీపంలోని ఓ పాడుబడిన బావిలో గురువారం శవాలై తేలడం కలకలం సృష్టించింది. ఆ కుటుంబంలో మరో ఇద్దరు యువకులు, వారితో కలిసి ఉంటున్న బీహార్‌కు చెందిన మరో ఇద్దరు యువకులు కనిపించకపోవడంతో పోలీసులు ఇది వారి పనే అయ్యుంటుందని మొదట అనుమానించి గాలింపు మొదలుపెట్టారు. కానీ అదే బావిలో వారి శవాలు కూడా బయటపడటంతొ పోలీసులు షాక్ అయ్యారు. 

గురువారం ఆ బావిలో మహమ్మద్ మక్సూద్ ఆలం (50), నిషా ఆలం (45) దంపతులతో పాటు వారితో కలిసి ఉంటున్న వారి కుమార్తె బుశ్రా ఖాతూన్ (20), ఆమె కుమారుడు బేబీ షకీల్ (3) మృతదేహాలు బయటపడగా, శుక్రవారం ఉదయం అదే బావిలో మక్సూద్ ఆలం దంపతుల ఇద్దరు కుమారులు షాబాజ్ ఆలం (22), సొహైల్ ఆలం (21) శవాలు బయటపడ్డాయి. 

బావిలో లభించిన మరో మూడు శవాలలో ఒకటి వారితో కలిసి పనిచేస్తున్న బీహార్‌కు చెందిన శ్రీరామ్‌దిగా పోలీసులు గుర్తించారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు డ్రైవరుగా పోలీసులు గుర్తించారు. 

ఒకేసారి 9 మంది సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడం అందరినీ కలవరపరుస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్ధిక సమస్యలు తట్టుకోలేక వారు ఆత్మహత్యలు చేసుకొన్నారా లేక హత్య చేయబడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వారి శవాలను పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Related Post