కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కరోనాతో మృతి

May 21, 2020


img

హైదరాబాద్‌ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దయాకర్ రెడ్డి కరోనా వైరస్‌కు బలయ్యారు. నల్గొండకు చెందిన దయాకర్ రెడ్డి వనస్థలిపురంలో నివాసం ఉంటూ పాతబస్తీలో లాక్‌డౌన్‌ డ్యూటీలో పనిచేస్తున్నారు. ఐదు రోజుల క్రితం ఆయనకు హటాత్తుగా తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో బేగంపేట వద్దగల నేచర్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు సోమవారం నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి కరోనా చికిత్స ప్రారంభించారు. కానీ అప్పటికే దయాకర్ రెడ్డిలో వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉండటంతో చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదు. బుదవారం రాత్రి 10.30 గంటలకు చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం డిజిపి మహేందర్ రెడ్డి స్వయంగా ట్విట్టర్‌ ద్వారా దృవీకరించారు. దయాకర్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దయాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  

దయాకర్ రెడ్డితో కలిసి పనిచేసిన 16 మంది కానిస్టేబుల్స్ కు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో కరోనా లక్షణాలు కనబడిన నలుగురు పోలీసులను క్వారెంటైన్‌కు తరలించారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, వారితో సన్నిహితంగా మెలిగినవారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. 

“మీరు క్షేమంగా మీ ఇళ్ళలో ఉంటే...మీ కోసం మేము రోడ్లపై ఉండి పనిచేస్తాము,” అని తెలంగాణ పోలీస్ శాఖ పదేపదే చెప్పిన మాట ఇప్పుడు గుర్తుచేసుకోక తప్పదు. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా ప్రభావిత ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూ ప్రాణం కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ దయాకర్ రెడ్డికి ప్రజల తరపున మై. తెలంగాణ.కామ్ నివాళులు అర్పిస్తోంది. 

            



Related Post