రైళ్ళు, విమానాలకు లేని అభ్యంతరం బస్సులకే ఎందుకు?

May 21, 2020


img

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం అయ్యాయి కానీ అంతర్ రాష్ట్ర సర్వీసులను ఇంకా అనుమతించలేదు. పొరుగు రాష్ట్రాలలో కొన్ని ప్రధాన నగరాలలో కరోనా వైరస్‌ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాలు అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులను అనుమతించలేదు. కరోనా కట్టడికి ఇది చాలా అవసరమే. కానీ కరోనా వైరస్‌ ఇప్పట్లో పోయేది కాదు...దానితో కలిసి బ్రతకక తప్పదని ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్రమోడీ పదేపదే చెపుతున్నప్పుడు ఇంకా ఎంత కాలం మూసుకొని కూర్చోన్నా నష్టం తప్ప లాభం లేదని స్పష్టం అవుతోంది. కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నా ముంబై, డిల్లీ నగరాల నుంచి అన్ని రాష్ట్రాలకు ప్యాసింజర్ రైళ్ళు, శ్రామిక్ రైళ్ళు నడుస్తున్నపుడు ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూర్చే అంతర్ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను నిలిపివేసుకొని ఏం ప్రయోజనం ఆర్టీసీకి ఇంకా నష్టం తప్ప?అనే ప్రశ్న వినబడుతోంది.

ముఖ్యంగా శ్రామిక్ రైళ్ళు ప్రారంభించిన తరువాత వలస కార్మికుల ద్వారా అన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 1,096 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. అలాగే శ్రామిక్ రైళ్ల సంఖ్యను ఇంకా పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినందున వలస కార్మికులలో కరోనా సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా 200 ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్దమవుతోంది. అంటే రైళ్ళు, విమానాలు నడుస్తున్నప్పుడు అంతర్ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను నడిపినా నడిపించకపోయినా కరోనా కేసులు పెరగడం అనివార్యమని అర్ధమవుతోంది. కనుక కరోనా వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోంటూ రాష్ట్రాల సరిహద్దులలో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారో అదే విధంగా అంతర్ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను కూడా నడుపవచ్చు. తద్వారా ఆర్టీసీ ఆదాయం పెంచుకొని నష్టాలను తగ్గించుకోవచ్చు కదా? 


Related Post