వర్షాకాలం నుంచే తెలంగాణలో కొత్త పంటల విధానం అమలు

May 20, 2020


img

తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తన ధ్యేయమని సిఎం కేసీఆర్‌ చాలాసార్లు చెప్పారు. ఆ దిశలో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది కూడా. కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీసి మంచినీటితో నింపడం, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు సరఫరా, రైతుబంధు, రైతు భరోసా వంటి పధకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తత్ఫలితంగా ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ నుంచి ఏకంగా 90 లక్షల టన్నుల బియ్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అందాయి. ఆ బియ్యమే నేడు పలు రాష్ట్రాలలో కేంద్రప్రభుత్వం పేదలకు అందజేస్తోంది. 

అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పధకాలతో రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగిందని కానీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీనికి కారణం ఒకే రకమైన పంట అవసరానికి మించి ఉత్పత్తి చేయడమే. డిమాండ్‌ను బట్టి సప్లై ఉన్నట్లయితే ఏ వ్యాపారమైనా...ఏ ఉత్పత్తి అయినా లాభసాటిగా ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు సిఎం కేసీఆర్‌ అమలుచేయబోతున్నది కూడా అదే. 

రాష్ట్రంలో రైతులందరూ ఒకే రకం వరి పండిస్తే అవసరానికి మించి బియ్యం మార్కెట్లోకి వస్తుంది దాంతో ధరలు పడిపోతాయి..రైతు నష్టపోతాడు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా ఈ వర్షాకాలం నుంచి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలి? ఏ రకం భూమిలో ఎటువంటి పంటలు వేయాలి? ఏ మేరకు వేయాలి? అనేది ముందుగా అనుకొని ఆ ప్రకారమే పనులు మొదలుపెట్టించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. 

దీనిని పకడ్బందీగా అమలుచేసి సత్ఫలితాలు సాధించాలంటే సమగ్ర ప్రణాళిక, దానిని యధాతధంగా ఆచరణలో పెట్టేందుకు పూర్తి అవగాహన కలిగిన అధికారులు, సిబ్బంది ఉండాలి. ఇప్పటికే రాష్ట్రంలో సాగుభూమిని 2,638 క్లస్టర్లుగా విభజించి, ఒక్కో క్లస్టరుకు ఒక్కో వ్యవసాయ విస్తరణాధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కనుక ఈ పధకాన్ని ఇక ఆచరణలో పెట్టడమే ఆలస్యం. 

ఈ నూతన విధానంపై సిఎం కేసీఆర్‌ రేపు ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలక్టర్లు, ఉన్నతాధికారులు, రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యి దిశానిర్దేశం చేయనున్నారు. సిఎం కేసీఆర్‌ సూచనల మేరకు జిల్లా అధికారులు వ్యవసాయ మ్యాప్‌ను రూపొందిస్తారు. దాని ఆధారంగానే ఈసారి రాష్ట్రంలో పంటలు వేయనున్నారు. 


Related Post