నోటీసులు పంపడానికే కృష్ణా బోర్డు ఉందా?

May 20, 2020


img

ఉమ్మడి శ్రీశైలం జలాశయంలో నీళ్ళ వాడకంపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల మద్యన మొదలైన యుద్ధం కొత్త మలుపు తీసుకొంది. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ నోటీసు పంపించిన సంగతి తెలిసిందే. దానికి బదులుగా ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ వ్రాసింది. 

పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, మిషన్ కాకతీయ, తుమ్మిళ్ళహట్టి వంటి అనేక ప్రాజెక్టులను  బోర్డు నుంచి, అఆపెక్స్ కౌన్సిల్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అలాగే ఎటువంటి అనుమతులు పొందకుండానే కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టుల నీటి నిలువ సామర్ధ్యం కూడా పెంచిందని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన ఆ ప్రాజెక్టుల వలన దిగువన ఉన్న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కనుక ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా నిర్మించిన, ఇంకా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా కృష్ణా బోర్డు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. 

ఏపీ ప్రభుత్వం పిర్యాదును స్వీకరించిన కృష్ణా బోర్డు దానిపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసు పంపించింది. కృష్ణా బోర్డు సభ్యుడు హరికేష్ మీనా తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శికి ఈ మేరకు లేఖ వ్రాశారు.    

కృష్ణా, గోదావరి జలాలను వాడుకొనే రాష్ట్రాల మద్య ఇటువంటి సమస్యలు తలెత్తకుండా నివారించేందుకే ఆ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ రెండు రాష్ట్రాలు బోర్డు అనుమతి తీసుకోకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ చేతులు ముడుచుకొని కూర్చోంటున్న ఈ బోర్డులు, ఒక రాష్ట్ర ప్రభుత్వం మరో రాష్ట్ర ప్రభుత్వంపై పిర్యాదులు చేసుకొంటే గానీ మేల్కొకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పిర్యాదులు అందేక పోస్టల్ డిపార్టుమెంట్‌లాగా ఈవిధంగా నోటీసులు బట్వాడా చేయడానికే బోర్డులు పరిమితమవుతున్నాయి తప్ప సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి. దాంతో రెండు రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయింది.  

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం పనులు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. కనుక త్వరలో పనులు కూడా ప్రారంభం అవుతాయి. ఈ సమయంలో కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోగలదా? అంటే అనుమానమే. మరప్పుడు బోర్డు ఏమి చేస్తుంది? 


Related Post