రాష్ట్రాలతో సంబందం లేకుండా శ్రామిక్ రైళ్ళు

May 19, 2020


img

వివిద రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు రైల్వే శాఖ శ్రామిక్ రైళ్ళు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలు సంప్రదించుకొని వలస కార్మికులను పంపిస్తుండేవి. కానీ ముంబై, పూణే, డిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ వంటి కొన్ని ప్రధాన నగరాలలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల నుంచి వచ్చే వలస కార్మికులకు కరోనా వైరస్‌ సోకుతోంది. వారి ద్వారా తమ రాష్ట్రాలలో మళ్ళీ కరోనా వ్యాపిస్తుందనే భయంతో కొన్ని రాష్ట్రాలు శ్రామిక్ రైళ్ళను అనుమతించడం లేదు. దీనివలన రైల్వేశాఖకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంతో ఇక నుంచి శ్రామిక్ రైళ్ళకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర హోంశాఖ అనుమతి ఉంటే సరిపోతుందని ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా వలస కార్మికులకు సుమారు రెండు నెలలుగా పని, ఆదాయం లేకపోవడంతో వారు తమ స్వరాష్ట్రాలకు కాలినడకన వెళ్లిపోవడానికి కూడా వెనకాడటం లేదు. దాంతో రైల్వేశాఖ వారి కోసం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్ళు నడిపిస్తోంది. వలస కార్మికులను ఎక్కడివారిని అక్కడే ఉంచడం వలన కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు కానీ సుమారు రెండు నెలలుగా పని, ఆదాయం లేక విసిగెత్తిపోయున్న వారిని ఇప్పుడు నిలిపి ఉంచడం చాలా కష్టం అవుతోంది. కానీ వారిని తరలించడానికి రైల్వేశాఖ సిద్దపడితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం చెపుతుండటంతో కొత్త సమస్య ఎదురవుతోంది. అందుకే రాష్ట్రాల సమ్మతితో సంబందం లేకుండా శ్రామిక్ రైళ్ళను నడిపించాలని నిర్ణయించింది.


Related Post