భారత్‌కు మరో భారీ ఆర్ధిక మాంద్యం?

May 19, 2020


img

కరోనాకు ముందే ఆర్ధిక మాంద్యం కారణంగా భారత్‌లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. అయితే ఆ సమయంలో అన్ని రంగాలు తమ పూర్తి సామర్ధ్యంతో పనిచేస్తుండటంతో ఆ ప్రభావం పెద్దగా కనబడలేదు. కానీ మార్చి 24 నుంచి మే 31 వరకు 68 రోజులపాటు ఏకధాటిగా సాగుతున్న లాక్‌డౌన్‌ వలన దేశంలో అన్ని రంగాలు కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అవి మళ్ళీ కోలుకొనేందుకు కేంద్రప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల విలువగల భారీ ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించింది. కానీ అది అంకెల గారడీయే తప్ప దేశం మళ్ళీ కోలుకొనేందుకు ఏమాత్రం ఉపయోగపడదని సిఎం కేసీఆర్‌ కుండబద్దలు కొట్టినట్లు నిన్ననే చెప్పారు. 

కరోనాకు ముందున్న పరిస్థితులలో అయితే భారత్‌ తప్పకుండా ఎంతో కొంత వృద్ధి సాధించేది కానీ లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో తీవ్ర ఆర్ధిక మాంద్యం ఏర్పడనుందని ప్రముఖ అంతర్జాతీయ ఆర్ధిక సంస్థ గోల్డ్ మ్యాన్ శాస్ జోస్యం చెప్పింది. గతంతో పోలిస్తే స్థూల జాతీయోత్పత్తి మరింత తగ్గుతుందని దాని వలన 2021 ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ 5 శాతం కంటే తగ్గే అవకాశం ఉంటుందని గోల్డ్ మ్యాన్ శాస్ సంస్థకు చెందిన ఆర్ధిక నిపుణులు ప్రాచీ మిశ్రా, ఆండ్ర్యూ టిల్టన్ జోస్యం చెప్పారు. 

కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ, సంస్కరణల మద్యంతర వ్యూహంతో అమలుచేసినవి కనుక వాటితో ఇప్పటికిప్పుడు గొప్ప మార్పు, అభివృద్ధి ఆశించలేమని వారు చెప్పారు. కానీ భారత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి లేదా నిబద్దతో వాటిని అమలుచేసిందనే దానిపై వాటి ఫలితాలు ఆధారపడి ఉంటాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.    

లాక్‌డౌన్‌ కారణంగా దేశ ఆర్ధికవ్యవస్థను నిలబెట్టే అన్ని రంగాలు, వ్యవస్థలు స్తంభించిపోయినందున, రానున్న రోజులలో దేశంలో ఆర్ధిక మాంద్యం, సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని సామాన్య ప్రజలకు కూడా తెలుసు. అయితే ఇప్పటికే దేశ ప్రజలు అటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కూడా. కనుక ఇప్పుడు ప్రజల కంటే పాలకులపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నట్లు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలను, వ్యవస్థలను మళ్ళీ గాడిలో పడేందుకు చిత్తశుద్ధితో సహకరిస్తేనే దేశం ఈ ఆర్ధిక మాంద్యం అనే గండం గట్టెక్కగలుగుతుంది. లేకుంటే చాలా కష్టమే.


Related Post